నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు

by Prasanna |
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తుండడం.. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తారన్న ఆశాభావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దసరాలోపు ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఆశావహులు తమ తమ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో మిగతా కమిటీల ఏర్పాట్ల అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు మరికొన్ని పోస్టుల భర్తీ కావాల్సి ఉంది. ముఖ్యంగా ముడా చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం సొంత జిల్లా కావడంతో పార్టీ కోసం పనిచేసిన నేతలకు, కార్యకర్తలకు అన్ని విధాల మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మార్కెట్ కమిటీ ల ఎంపిక పూర్తి..!?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు మార్కెట్ కమిటీలలో అవకాశాలు కల్పించారు. ఈ కమిటీలు పూర్తికావచ్చిన నేపథ్యంలో మిగతా కమిటీల ఏర్పాట్ల అంశంపై పార్టీ శ్రేణులలో చర్చలు జరుగుతున్నాయి.

అందరి దృష్టి ముడా చైర్మన్ పైనే..

ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలకు కాకుండా మిగతా ప్రజానీకానికి కూడా మహబూబ్ నగర్ ముడా చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల నియోజకవర్గాలలోని పలు గ్రామాలను కలుపుకోవడం ద్వారా ఏర్పాటు అయిన ముడా చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన ఈ పదవి ఖాళీ అయి 9 నెలలు దాటుతున్నా కొత్తవారిని ప్రభుత్వం ఇప్పటికి ఎంపిక చేయలేదు. చైర్మన్ పదవితోపాటు జిల్లా, రాష్ట్రస్థాయి పెదవులు కూడా భర్తీ కాకున్న ఉన్న నేపథ్యంలో మరి కొంతమందికి తప్పనిసరిగా అవకాశాలు లభిస్తాయి అన్న ఆశలో ఆశావహులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని కొత్త జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులు నియామకం కావలసి ఉంది. వీటితోపాటు మరికొన్ని పోస్టుల భర్తీ జరగాల్సి ఉంది. సీఎం సొంత జిల్లా కావడంతో అన్ని విధాల మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story