ఆ స్థలం పోలీస్ స్టేషన్‌కు ఇవ్వడం కరెక్ట్ కాదు.. కలెక్టర్‌ను కలిసిన రఘునందన్ రావు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-24 03:44:15.0  )
ఆ స్థలం పోలీస్ స్టేషన్‌కు ఇవ్వడం కరెక్ట్ కాదు.. కలెక్టర్‌ను కలిసిన రఘునందన్ రావు
X

దిశ, పటాన్ చెరు: పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని పోలీస్ స్టేషన్‌కు కేటాయించడం సరికాదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. ఈ విషయంపై అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమీన్ పూర్ పట్టణ పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ప్రభుత్వ పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, ప్రాథమిక ఆస్పత్రి, పోలీస్ స్టేషన్‌లకు భూమిని కేటాయించారు. ఇప్పుడు ఉన్నపలంగా పాఠశాలలకు కేటాయించిన స్థలాన్ని రద్దుచేసి పోలీస్ స్టేషన్కు కేటాయించడం సరికాదన్నారు.

గతంలో పాఠశాలకు స్థలం కేటాయించడంతో స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు అమీన్ పూర్ పరిధిలోని కోకో కోలా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చారని తెలిపారు. దానికి తోడు ఆ పాఠశాలలో విద్యనుభ్యసించిన పూర్వ విద్యార్థులు సైతం ఆర్థికంగా సహాయం అందించి పాఠశాలలో వసతుల కల్పనకు చొరవ తీసుకున్నారన్నారు. అయితే ఇటీవల పాఠశాలకు కేటాయించిన స్థలంలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయగా పోలీసులు పాఠశాల నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా అక్కడ భూమి తమదని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారనన్నారు. దీనివల్ల పాఠశాల నిర్మాణం ఆగిపోయి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. అమీన్ పూర్ తహసీల్ధార్ గతంలో కేటాయించిన స్థలాల్లో మార్పిడి చేయడం విచారకరమని దయచేసి గతంలో స్టేషన్ కు కేటాయించిన స్థలంలోకి వారిని పంపించి పాఠశాల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఎంపీ రఘునందన్ వినతిపై కలెక్టర్, ఎస్పీ సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story