గ్రామపంచాయతీ లేఔట్ లో ప్రహరీ నిర్మాణం

by Prasanna |
గ్రామపంచాయతీ లేఔట్ లో ప్రహరీ నిర్మాణం
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లేఔట్ లో కొందరు రోడ్లను కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. కల్వర్ట్ లను సైతం ప్లాట్లుగా మార్చి వ్యాపారాలు చేస్తున్న అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. పైగా గ్రామపంచాయతీ లేఅవుట్ కు గేటెడ్ కమ్యూనిటీ లాగా ప్రహరీ నిర్మించి అందులోకి ఇతర ప్లాట్ల యజమానులను లోనికి రాకుండా నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు పరిధిలోని సర్వేనెంబర్ 201 లో గతంలోనే గ్రామపంచాయతీ అనుమతులతో వెంచర్ నిర్మించారు. ఇటీవల ఓ వ్యాపారి కొంతమంది బడా వ్యాపారులతో కలిసి బిల్డర్ గా అవుతారమెత్తారు. అందులోని ప్లాట్లను కొనుగోలు చేసి విల్లాల నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉంటే, సదరు వెంచర్ కు చుట్టూ ప్రహరి నిర్మాణం చేసి అందులో ఉన్న రోడ్లను సైతం కబ్జా చేసేస్తున్నారు. ఈ వెంచర్ నుంచి పక్క వెంచర్ల లోకి, పక్క భూములలోకి దారులు ఉన్నప్పటికీ వెంచర్ చుట్టూ ప్రహరీ నిర్మించి రోడ్లు మూసేశారు. కొన్ని రోడ్లలో నిర్మాణాలు చేపట్టారు. కాగా, ఇందులో ఉన్న ఒకరిద్దరు తమ ప్లాట్లను చూసుకునేందుకు వెళితే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మీ ఫ్లాట్లు ఎలాగైనా తక్కువ ధరకు తమకే అమ్మాలని లేదంటే లోనికి రానివ్వమంటూ సెక్యూరిటీతో లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని సదరు ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎవరూ లోపలికి రాకుండా సెక్యూరిటీతో అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కుంట్లూరు నుంచి నాగోల్ వెళ్లే దారిలో ఉన్న ఈ వెంచర్ లో కల్వర్టులు ఉన్నప్పటికీ వాటిని సైతం లేఔట్ లో ప్లాట్లుగా చూపిస్తూ వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు కబ్జా చేస్తూ ప్రహరీ నిర్మించిన విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవిస్తే పరిశీలించిన అధికారులు తూతూమంత్రంగా రోడ్ల పైన ఉన్న బేస్మెంట్లను ముట్టుకోకుండా రోడ్డును క్లియర్ చేశామని ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే, ఈ వెంచర్లు దాదాపు 13 రోడ్ల దారులు ఉన్నాయని వాటన్నిటిని తొలగించాలని, అదేవిధంగా తన ప్లాట్ లోకి వెళ్తున్న తమను అడ్డుకోకుండా తమ ప్లాట్ల కు రక్షణ ఇవ్వాలని స్థానిక ఫ్లాట్ల యజమానులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ వెంచర్ కు మరో లేఔట్ సృష్టించి ప్లాట్లను విక్రయిస్తుండడం కొసమెరుపు.

తమ ప్లాట్లను కబ్జా చేస్తున్నారు.. గ్యారాల హరి

సర్వేనంబర్ 201లో చేసిన లే అవుట్ వెంచర్లో 541, 542 నంబర్ గల ప్లాట్లు తాము గతంలో కొనుగోలు చేశాము. తమ ప్లాటులో సైతం గుంతలు తవ్వుతూ ప్లాట్లు పనికిరాకుండా చేస్తున్నారని ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ ప్లాట్లు తమవి కావని అంటూ బెదిరిస్తున్నారని అన్నారు. పైగా తమ ప్లాట్లను వారికి విక్రయించాలని ఒత్తిడి తెస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. చుట్టూ నిర్మించిన ప్రహారిని కూల్చివేయాలని గతంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా పాక్షికంగా కూల్చివేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed