Ranjeeta Priyadarshini: వేతనంతో కూడిన నెలసరి సెలవులు ఇవ్వాలి

by Shamantha N |
Ranjeeta Priyadarshini: వేతనంతో కూడిన నెలసరి సెలవులు ఇవ్వాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి(UN) సమావేశంలో నెలసరి సెలవుల గురించి సామాజిక ఉద్యమకారిణి రంజీతా ప్రియదర్శిని మాట్లాడారు. అమెరికాలో న్యూయార్క్‌ నగరంలో 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ రంజీతా అన్నారు. అప్పుడే మహిళలు వేతనం గురించి ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని అన్నారు. రెండోసారి ఐక్యరాజ్యసమితి సదస్సుకు హాజరైనందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నదే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. నెలసరి రోజుల్లో ఒకటి నుంచి రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెన్యాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో తొలిసారిగా ఈ విషయం గురించి ప్రస్తావించానని అన్నారు. ఆ తర్వాతే ఒడిశా ప్రభుత్వం సెలవు దిశగా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పెయిడ్‌ పీరియడ్ లీవ్‌ అమలుచేసిందన్నారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఏడాదికి ఆ తరహాలో ఆరు సెలవులు ప్రకటించినట్లు వెల్లడించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యను అభినందించిన ఆమె.. ఆ సెలవుల సంఖ్యను 12కు పెంచాలని కోరారు.

పోరాటం వెనుకున్నకారణమిదే..

ఇకపోతే, తన పోరాటం వెనక వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలు కారణమని సామాజిక కార్యకర్త రంజీతా ప్రియదర్శి తెలిపారు. నెలసరి సమయంలో తాను సెలవు కోరినందుకు తన మేనేజర్ నుంచి అవమానం ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించారు. ఆ తర్వాత నెలసరి ఆరోగ్యం గురించి చర్చించేలా, ఆ దిశగా నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైన 40 మందికి పైగా దేశాధినేతలు వారి దేశాల్లోనూ వేతనంతో కూడిన నెలసరి సెలవులు అమలు చేయాలని అభ్యర్థించారు.

Next Story