అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో BRS టాప్.. అధికార కాంగ్రెస్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-15 03:00:32.0  )
అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో BRS టాప్.. అధికార కాంగ్రెస్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోరు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగింది. అధికారంలోకి రావడానికి తమ శక్తికి మించి కొట్లాడాయి. ఓ పార్టీ మీద మరో పార్టీ పైచేయి సాధించేందుకు ఖర్చుకు సైతం వెనకాడలేదు. అటు అభ్యర్థులు, ఇటు పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేశాయి. ఈ ఖర్చు విషయంలో బీఆర్ఎస్ పార్టీ టాప్ ప్లేసులో నిలిచింది. ఆ పార్టీ రూ.175 కోట్లను ఖర్చు చేయగా.. బీజేపీ రూ.117 కోట్లు చేసి ఆ తరువాతి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ రూ.98 కోట్లను ఖర్చు పెట్టగా.. అతి తక్కువ ఖర్చు పెట్టిన పార్టీనే అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఈ లెక్కలన్నీ ఆయా పార్టీలు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన ‘ఎక్స్‌పెండిచర్ రిపోర్టు’లో వెల్లడించినవే. అయితే.. వాస్తవ లెక్కలకూ, ఆధారాలకూ చిక్కకుండా పార్టీలు, అభ్యర్థులు చేసిన ఖర్చు ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువే. అన్ని పార్టీల అభ్యర్థులు బీరు, బిర్యానీ తదితరాలకు చేసింది లెక్కలోకే రాలేదు. ఇక ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ రోజు వరకు ఓటర్లకు సమర్పించుకున్న పచ్చ నోట్ల లెక్కలూ వీటిలో చేరలేదు.

ప్రకటనలు.. పబ్లిక్ మీటింగులు..

అన్ని పార్టీలు ఎలక్షన్స్ కోసం చేసిన మొత్తం ఖర్చులో మీడియాలో ప్రకటనలకు, పబ్లిక్ మీటింగుల నిర్వహణకే ఎక్కువ వెచ్చించాల్సి వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ చేసిన ఖర్చుతో పోలిస్తే కాంగ్రెస్ వెచ్చించింది సగానికంటే తక్కువే. మూడు పార్టీలూ నియోజకవర్గాలవారీగా రకరకాల పేర్లతో బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించాయి. ఎక్కువగా ఈ ఖర్చు మొత్తం పార్టీల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. అభ్యర్థులు చేసే ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ సీలింగ్ విధించడంతో ఇవన్నీ పార్టీల లెక్కల్లో పడ్డాయి. పార్టీలకు నిర్దిష్టంగా ఎలాంటి పరిమితి లేకపోవడమే ఇందుకు కారణం. పార్టీ జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్‌లు.. ఇలాంటివన్నీ పార్టీ ‘పబ్లిసిటీ మెటీరియల్’ ఖాతా కింద చూపించుకున్నాయి.

అభ్యర్థులకు ఫండ్స్ ఇచ్చిన పార్టీలు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీలే నిధులను సమకూర్చాయి. బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చొప్పున చెక్కుల రూపంలో అందజేయగా.. కాంగ్రెస్ మాత్రం రూ.30 లక్షలను, బీజేపీ రూ.25 లక్షల చొప్పున ఇచ్చింది. ఇదంతా పార్టీ సెంట్రల్ ఫండ్ నుంచి సమకూర్చినట్లు రిపోర్టులో పేర్కొన్నాయి. బీఆర్ఎస్ మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తలా రూ.40 లక్షల చొప్పున మొత్తం రూ.47.60 కోట్లను ఇచ్చింది. కాంగ్రెస్ మొత్తం 118 మంది అభ్యర్థులకు తలా రూ.30 లక్షల చొప్పున రూ.35.40 కోట్లను వెచ్చించింది. బీజేపీ సైతం తలా రూ.25 లక్షల చొప్పున రూ.27.50 కోట్లను, ఇతర అవసరాలకు మరికొంత అదనంగా కలిపి మొత్తం రూ.35.83 కోట్లను ఖర్చు చేసింది. పార్టీ తరఫున అభ్యర్థులకు ఫండింగ్ అందినా సొంతంగా చేసిన ఖర్చు అనేక రెట్లు ఎక్కువగానే ఉన్నది.

ఆయా పార్టీలు ‘ఎక్స్ పెండిచర్ రిపోర్టు’లో పేర్కొన్న వివరాలు..

బీఆర్ఎస్

మొత్తం వ్యయం: రూ.175.19 కోట్లు

ఇందులో అభ్యర్థులకు: రూ.46.70 కోట్లు

వారి నేర చరిత ప్రకటనలకు: రూ.67.11 లక్షలు

స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణానికి: రూ.3.54 కోట్లు

పార్టీ ప్రచారం, మీడియా యాడ్‌లకు: రూ.71.98 కోట్లు

పబ్లిసిటీ మెటీరియల్: రూ.21.41 కోట్లు

బహిరంగ సభలు, ర్యాలీలకు: రూ.29.50 కోట్లు

ఇప్పటివరకు జరిగిన పేమెంట్స్: రూ.105.50 కోట్లు

పెండింగ్‌లో ఉన్నది (మార్చి 31 నాటికి): రూ.21.41 కోట్లు

బీజేపీ

మొత్తం వ్యయం: రూ.117.12 కోట్లు

ఇందులో అభ్యర్థులకు: రూ.35.83 కోట్లు

స్టార్ క్యాంపెయినర్లకు: రూ.13.89 కోట్లు

పత్రికలు, టీవీల్లో యాడ్‌లకు: రూ.30.35 కోట్లు

పబ్లిసిటీ మెటీరియల్: రూ.4.62 కోట్లు

ప్రచారానికి: రూ.31.96 కోట్లు

సోషల్ మీడియాకు: రూ.4.59 కోట్లు

కాంగ్రెస్

మొత్తం వ్యయం: రూ.98.10 కోట్లు

యాడ్‌లు, సోషల్ మీడియాకు: రూ.50.22 కోట్లు

అభ్యర్థులకు ఫండింగ్: రూ.35.40 కోట్లు

పీసీసీ చీఫ్ క్యాంపెయిన్‌కు: రూ.1.80 కోట్లు

రాహుల్, ప్రియాంక, ఖర్గే టూర్‌కు: రూ.10.94 కోట్లు

బల్క్ ఎస్ఎంఎస్‌లకు: రూ.88.94 లక్షలు

ఏఐసీసీ నేతల వసతికి: రూ.82.60 లక్షలు

(ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ టూర్‌లకు రాహుల్, ప్రియాంక, ఖర్గే క్యాంపెయిన్ ఖర్చు కూడా కలిపి)

Advertisement

Next Story

Most Viewed