BRS: స్థానిక ఎన్నికలకు ముందు కేసీఆర్ 'తమిళ' రాజకీయం.. బీఆర్ఎస్ గట్టెక్కేనా?

by Prasad Jukanti |   ( Updated:2024-09-26 08:25:00.0  )
BRS: స్థానిక  ఎన్నికలకు ముందు కేసీఆర్ తమిళ రాజకీయం.. బీఆర్ఎస్ గట్టెక్కేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం తమిళనాడుకు చేరుకుంది. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనా చారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో 25 మంది సభ్యుల టీమ్ గురువారం అక్కడికి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం బీసీల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లు, బడ్జెట్ లో కేటాయింపులు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు కల్పిస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలను ఈ బృందం అధ్యయనం చేయనున్నది. ఈ అధ్యయనం నివేదికను బీఆర్ఎస్ అధిష్టానానికి అందజేయనున్నది. ఇందులో భాగంగా గురువారం తమిళనాడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్, సెక్రటరీతో భేటీ కానున్నది. శుక్రవారం డీఎంకే ఆఫీసుకు వెళ్లి అక్కడ ఆ పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

అరవ పాలిటిక్స్ బీఆర్ఎస్ ను గట్టెక్కించేనా?

ప్రస్తుతం బీఆర్ఎస్ తెలంగాణలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన గులాబీ పార్టీ అధికారం కోల్పోగానే రోజు రోజుకు చతికిల పడిపోతున్నది. గత అనుభవాల దృష్ట్యా బీఆర్ఎస్ ను కమ్మేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ జీరో స్థానాలకు పడిపోయింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నడుమ బీఆర్ఎస్ అస్థిత్వపోరాటం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. దీంతో అప్రమత్తమైన అధిష్టానం ఇక పార్టీ బలోపేతం పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీల అధ్యయనానికి శ్రీకారం చుట్టుంది. ఈ మేరకు గత నెలలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలోని ఓ బృందాన్ని గులాబీ బాస్ కేసీఆర్ చెన్నైకి పంపించారు. ఆ బృందం అక్కడ డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి అర్ఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే శేఖర్ తో ఈ బృందం భేటీ అయింది. ప్రాంతీయ పార్టీగా డీఎకే పార్టీ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అనుసరిస్తున్న విధివిధానాలు స్టడీ చేసింది. ఈ టీమ్ వెళ్లి వచ్చిన కొన్ని రోజుల గ్యాప్ తర్వాత అదే తమిళనాడుకు బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం మరో బృందం బయలుదేరింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ చేస్తున్న తమిళనాడు రాజకీయాలు కారు పార్టీకి ఏ మేరకు కలిసివస్తాయో చూడాలి మరి.

Advertisement

Next Story