KTR : కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ మరిన్ని విజయాలు సాధించాలి : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-01 07:46:01.0  )
KTR : కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ మరిన్ని విజయాలు సాధించాలి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సరం(New Year)లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సారధ్యంలో పార్టీ మరిన్ని మంచి విజయాలు సాధించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆకాంక్షించారు. తెలంగాణ భవన్ లో పార్టీ క్యాలెండర్ (Party Calendar)ను ఆవిష్కరించి కేటీఆర్ మాట్లాడారు. ఆంగ్ల నూత‌న సంవ‌త్సరం తొలి రోజున బీఆర్ఎస్ నాయకత్వమంతా తెలంగాణ‌ భ‌వ‌న్‌కు విచ్చేసి క్యాలెండ‌ర్‌ను ఆవిష్కరించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు. మ‌నంద‌రం మ‌న‌స్ఫూర్తిగా కాంక్షిస్తున్నది ఒక్కటేనని చావునోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ సాధించిన నాయ‌కుడు కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల‌న్నదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఒకే ఒక్క కోరితో మనమంతా గ‌ట్టిగా ప‌ని చేస్తున్నామని ఈ ఏడాది కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌న పార్టీ మ‌రిన్ని విజ‌యాలు న‌మోదు చేయాల‌ని ఆకాంక్షించారు.

ప్రజల ఆశీస్సులు పూర్తిస్థాయిలో తిరిగి పొందాల‌ని, మ‌న‌కు ఎదుర‌య్యే అడ్డంకులు ఎదుర్కొనే శ‌క్తి ఆ భ‌గ‌వంతుడు మనకు ప్రసాదించాల‌ని, మీ కుటుంబాల‌తో సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నానన్నారు . కుల‌మ‌తాల‌కు అతీతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం, రాష్ట్రం ఎల్లవేళ‌లా ప్రశాతంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి స‌త్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ క‌ట్ చేయించారు. కాగా న్యూ ఇయర్ క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరిస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు కేటీఆర్ ను ఉద్దేశించి ‘సీఎం సీఎం’ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే ఆయన మాత్రం తన ప్రసంగంలో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస‌న‌మండ‌లిలో బీఆర్ఎస్ పక్ష నేత ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రులు స‌త్యవ‌తి రాథోడ్, మ‌ల్లారెడ్డి, మ‌హ‌ముద్ అలీ, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుతో పాటు పార్టీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story