శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు.. కారణమదేనా..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-21 06:04:11.0  )
శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు.. కారణమదేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాసోజు శంకరమ్మ‌కు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైదరాబాద్‌కు రావాలని సూచించడంతో పాటు ఈ నెల 22న జరిగే అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని పార్టీ కోరింది. దీంతో ఆమె ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట తీసుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకు వెళ్ళనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి శంకరమ్మకు ఫోన్ చేసినట్లు తెలిసింది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2014లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో శంకరమ్మ‌కు కాకుండా సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ కేటాయించింది. అప్పటినుంచి శంకరమ్మ అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్ళిన మంత్రి కేటీఆర్‌ను శంకరమ్మ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా సీఎం కేసీఆర్ ను సైతం శంకరమ్మ కలిసి తనకు రాజకీయ అవకాశం కల్పించాలని, ఏదైనా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ?

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందుకోసం అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది. ఈ తరుణంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు ఆందోళన బాట పట్టారు. నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నాడంతో రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో శంకరమ్మను ఎంపిక చేయనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.

అయితే అధిష్టానం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి గురువారం అమరవీరుల స్మారక స్తూపం దగ్గరకు తీసుకెళ్తానని చెప్పడంతో పాటు కేసీఆర్ సైతం మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అదే వేదికపై శంకరమ్మకు నామినేటెడ్ పదవిపై ప్రకటన చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకసారిగా శంకరమ్మను అధిష్టానం దగ్గరకు తీయడంతో రాజకీయ లబ్ధి కోసమేనని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

Also Read..

ఆ 12 మందికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్!

Advertisement

Next Story