కలిసిపోనున్న బీఆర్ఎస్, బీజేపీ.. చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ కవిత!

by GSrikanth |
కలిసిపోనున్న బీఆర్ఎస్, బీజేపీ.. చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ కవిత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య రామమందిరంపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ గులాబీ నేతల్లో చర్చనీయాంశమైంది. హిందువుల ఓట్ల కోసమా.. లేకుంటే బీజేపీతో కలిసిపోయే ప్లాన్ లో భాగంగానే ట్వీట్ చేశారా..? అనే చర్చ సర్వత్రా సాగుతున్నది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉన్న తరుణంలో తాజా పరిణామం ఆసక్తి కలిగిస్తున్నది. ఇప్పటికే ఇద్దరి టార్గెట్ కాంగ్రెస్ కావడంతోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెట్టాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఏమని ట్వీట్ చేశారంటే..

‘అయోధ్యలో సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతోపాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. గర్భగుడికి సంబంధించిన ఫొటో, వీడియోను సైతం పోస్ట్ చేశారు. ఇది కాస్తా గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ పరిధిలో క్రమంగా బీజేపీ బలపడుతుండటం, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో హిందువుల ఓట్లను ఆకర్శించేందుకే ఈ ట్వీట్ చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసు, కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీలను విమర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story