ఏపీలో బీఆర్ఎస్‌కు బ్రేకులు! గులాబీ బాస్ వెనక్కి తగ్గడానికి కారణమిదేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:42:23.0  )
ఏపీలో బీఆర్ఎస్‌కు బ్రేకులు! గులాబీ బాస్ వెనక్కి తగ్గడానికి కారణమిదేనా?
X

బీఆర్ఎస్‌గా పార్టీ పేరును మార్చిన తర్వాత ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ పార్టీని విస్తరించాలని సీఎం కేసీఆర్ భావించారు. అందుకు అనుగుణంగానే ఏపీలో కాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను పార్టీలో చేర్చుకున్నారు. తోట చంద్రశేఖర్‌కు ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. విశాఖలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. కానీ ఈ లోపు కేసీఆర్ నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం సైలెంట్‌గా ఉండాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దనే నిర్ణయానికి గులాబీ అధినేత వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే ఏపీలో పార్టీ ఆఫీసు పొగ్రామ్‌కు సైతం కేసీఆర్ దూరంగా ఉన్నారని టాక్.

తెలంగాణపై చంద్రబాబు ఎఫెక్ట్

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపడితే చంద్రబాబుకు మేలు జరిగే చాన్స్ ఉందని కేసీఆర్ గ్రహించినట్టు సమాచారం. ఏపీలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య రసవత్తర రాజకీయాలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ విస్తరణ చేపడితే జగన్‌కు సానుకూలంగా ఉన్న కాపు, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు చీలుతాయని దీని వల్ల చంద్రబాబుకు మేలు కలుగుతుందన్న అనుమానం కేసీఆర్‌ను వెంటాడుతున్నట్టు సమాచారం.

దీనితో పాటుగా కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడితే చంద్రబాబు ఎంతో కొంత ఆగ్రహానికి గురవుతారని, దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఉంటుందని గులాబీ బాస్ గ్రహించినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో టీడీపీకి ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉన్నది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరిస్తాననే అనుమానం బీఆర్ఎస్ లీడర్లను వెంటాడుతున్నది.

అదే జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఏపీలో బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సైతం అక్కడి పర్యటనకు వెళ్లొద్దని, ఆ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టొద్దని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.

సర్వేలో కీలక విషయాలు

ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల ఫీలింగ్ తెలుసుకునేందుకు కేసీఆర్ పలు సర్వేలు చేయించారు. అందులో ఉత్తరాంధ్ర ప్రజలు తప్పా మిగతా రాష్ట్రం మొత్తం కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై నెగిటివ్ ఫీలింగ్‌తో ఉన్నట్టు నివేదికలు వచ్చాయని సమాచారం. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ తిట్లు, శాపనార్థాలు అక్కడి చాలా మంది మర్చిపోలేదని సర్వేలో వెల్లడైనట్టు తెలిసింది. ప్రధానంగా హైదరాబాద్ సిటీతో ఉన్న అనుబంధాన్ని కోల్పోయమనే ఆవేదన వారిలో వ్యక్తమైనట్టు టాక్.

Advertisement

Next Story