BJP: మంచి నాయకుల చేతులను కట్టిపడేశారు

by Gantepaka Srikanth |
BJP: మంచి నాయకుల చేతులను కట్టిపడేశారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రానున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆయన రబ్బర్ స్టాంపుగానే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఒక అధ్యక్షుడు తన సొంత గ్రూపును తయారు చేసుకొని పార్టీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. కొత్త పార్టీ అధ్యక్షుడు కూడా అదే విధంగా గ్రూపులను ప్రోత్సహిస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మంచి నాయకుల చేతులను కట్టిపడేశారని, సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య చర్చలు నిర్వహించవద్దని, పార్టీకి చెడ్డ పేరు తేవద్దని సూచించారు. సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులోని మాటనే తాను బయటపెడుతున్నానని చెప్పారు. పార్టీ నేతలకు చెప్పాలి కానీ మీడియా ముందుకు వెళ్లవద్దని కొందరు చెబుతున్నారని, కానీ పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపారు. సీనియర్ నాయకులను బీజేపీ గుర్తించడం లేదని, నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదని మండి పడ్డారు. బిజెపి అంటే హిందుత్వ పార్టీ అని, ధర్మం గురించి పని చేసే అటువంటి కార్యకర్తలను ప్రోత్సహం ఇవ్వాలని సూచించారు. గతంలో పార్టీలో కార్యకర్తలను , పాలనలో అధికారులను ఎదగకుండా తొక్కేవారని, దీంతో ఎంతో నిజమైన కార్యకర్తలు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story