మిస్టర్ రేవంత్ చిల్లర మాటలు మానుకో...!

by Kalyani |
మిస్టర్ రేవంత్ చిల్లర మాటలు మానుకో...!
X

దిశ, గజ్వేల్ రూరల్ : మిస్టర్ రేవంత్ చిల్లర మాటలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు ఫైరయ్యారు. సోమవారం గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని పైగా రైతు బంధు మింగిన రాబందు ముఖ్యమంత్రి రేవంత్ అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ నీరు రెండు అంతస్తుల వరకు నీటి సరఫరా అవుతే ఇప్పుడు ప్రజలకు సరిపడినన్ని నీటి సరఫరా కూడా జరగడం లేదని పైగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధించిందని ఆరోపించారు.

గత కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గాన్ని వేల కోట్ల నిధులతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని అన్నారు. గజ్వేల్ కి రైలు, రేక్ పాయింట్, అద్వితీయమైన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్, నాలుగు వరుసల రోడ్లు, మహతి ఆడిటోరియం, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, పాండవుల చెరువు, హార్టికల్చర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, గజ్వేల్ రింగ్ రోడ్ ఇలా చెప్పుకుంటూ పోతే వేల కోట్లతో కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గజ్వేల్ లో ప్రారంభించిన దాదాపు రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 17 నెలల పాలనలో గజ్వేల్ లో ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు. గత కేసీఆర్ పాలనలో మల్లన్నసాగర్ భునిర్వాసితులకు రూ.1260 కోట్ల రూపాయలను ఇచ్చామని, 90 శాతం వాళ్ళ సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఒక 5 నుండి 10 శాతం వరకు న్యాయం చేయాల్సి ఉందని అందుకు రూ.200 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తే సరిపోతుందని అన్నారు.

ఆనాడు మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన రేవంత్ రెడ్డి చేసిన దీక్ష నాటకమా.. లేదా నిజమా అని ప్రశ్నించారు. నిజమైతే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ఎందుకు వారికి న్యాయం చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు తక్కువ పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించిన మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కాబట్టి మేము ఇచ్చిన పరిహారానికి డబుల్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఈనెల 26వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్ పద్దు మీద కట్ మోషన్ ఇచ్చామని మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన నిలదీస్తామని అన్నారు.

మీ దరిద్రపు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుపైన దృష్టి పెట్టాలని హితవు పలికారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని మదీనా మజీద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తొలి ఛైర్మన్‌, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story