కార్మిక కుటుంబాలకు లేబర్ కార్డు సురక్ష..

by Kalyani |
కార్మిక కుటుంబాలకు లేబర్ కార్డు సురక్ష..
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : ఏదైనా కంపెనీ, సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు, సంస్థలే ప్రమాద బీమా తో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ లు చేయిస్తుంటాయి. కానీ భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఎలాంటి భరోసా ఉండదు. భవన నిర్మాణ కార్మికులు అంటేనే ఎండనక వాననకా ప్రతిరోజు కాయ కష్టం చేస్తూ, అతి కష్టం మీద చాలీచాలని సంపాదనతో బ్రతుకు బండిని నడిపిస్తుంటారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి చేయాలి. వారికంటూ పర్మినెంట్ పని అనేది ఉండదు. పని దొరికితే కడుపు నిండుతుంది పని లేనినాడు పస్తులే. లేబర్ అడ్డా మీదకు వెళ్తే తాపీ మేస్త్రి కి రోజుకు రూ.1200, లేబర్ పనిచేసే పురుషుడికి రూ.800, మహిళలకు రూ.700 ఇస్తారు. భవన నిర్మాణం కిందకు వచ్చే సెంట్రింగ్, ప్లంబర్, ఫ్లోరింగ్, పెయింటర్స్, కరెంటు పని చేసే కార్మికులకు కూడా దాదాపుగా ఇంతే డబ్బులు ఇస్తారు. ఇలా చాలీచాలని సంపదలతో బతుకు బండి నడపడమే భారంగా ఉన్న ఆ కుటుంబాలలో పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేయాలంటే అనేక కష్టాలు పడాల్సి వస్తుంది.

అలాంటి కుటుంబంలో అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే...? ప్రమాదవశాత్తు భవన నిర్మాణ పనులు చేస్తుండగా కుటుంబ పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి..? ఎందుకోసం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కూడా అండగా నిలుస్తుంది. ఆ కుటుంబాలకు లేబర్ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2009 సంవత్సరం నుంచి అమలులో ఉన్న ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 45 వేల మంది లేబర్ కార్డు కలిగి ఉన్నారు. గత 2024 జూలై నెల నాటికి జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ భవన నిర్మాణ బోర్డుతో పాటు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకొని లేబర్ కార్డు కలిగి ఉన్న 55 మంది కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల ప్రమాద భీమా తో పాటు అంత్యక్రియల కోసం రూ.30,000 మొత్తంగా రూ.3,46,41,672 అందించడం జరిగింది.

సహజ మరణాల కింద 375 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష బీమాతో పాటు అంత్యక్రియల కోసం రూ.30,000 మొత్తంగా రూ.4,66,92,198 అందించడం జరిగింది. ఇవే కాక మహిళా కార్మికులకు ప్రసూతి సహాయంగా ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున 1027 మందికి రూ.3,08,26,556 ఆర్థిక సహాయం అందించగా, కొత్తగా పెళ్లి చేసుకున్న కార్మికులకు వివాహ కనుక కింద ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున 439 మందికి గాను రూ.1,31,85,960 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జిల్లా మొత్తం 1896 మంది లబ్ధిదారులకు రూ.12,53,46,386 లబ్ధి చేకూరిందని జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. కానీ కొందరు నిర్మాణ కార్మికులకు అవగాహన లేక మరికొందరు నిర్లక్ష్యంగా లేబర్ కార్డు తీసుకోవడం లేదు.

లేబర్ కార్డుతో ప్రయోజనాలు

భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లేదా నిర్మాణ పని నుంచి వెళ్తుండగా ఎలాంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అటువంటి వారికుటుంబానికి రూ.6 లక్షల ప్రమాద బీమాతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.30,000, మృతి చెందిన దగ్గర నుండి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి కిలోమీటరుకు రూ.20 చొప్పున దాదాపు రూ.30,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సహజ మరణానికి రూ.1 లక్ష బీమాతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.30,000 అందించడం జరుగుతుంది.

అలాగే పెళ్లి కానుక రూ.30,000, ప్రసూతి సహాయం రూ.30,000, ప్రమాదంలో నిర్మాణ కార్మికుడు గాయపడి పాక్షిక, శాశ్వత వైకల్యం కలిగితే వైకల్యాన్ని బట్టి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే గాయపడిన కార్మికులకు ఆసుపత్రి ఖర్చులతో పాటు, కృత్రిమ అవయవాలు, చక్రాల కుర్చీ ట్రై సైకిల్ కూడా అందించడం జరుగుతుంది. వీటితోపాటు ప్రతి కార్మికుడికి హెల్త్ చెకప్ కింద ఉచితంగా 132 టెస్టులు, కార్మిక విభాగంలోని వివిధ పనులలో నైపుణ్యం పొందడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఉచితంగా ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. ఇలా లేబర్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కావున ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి.

కార్మికులు అందరూ లేబర్ కార్డు తీసుకోవాలి : జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) బి.వాల్య

భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు కలిగి ఉండాలి. మీసేవ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వేరే ఇతర షాపులలో అక్కడక్కడ పనిచేసే వారు తెలియక లేబర్ కార్డుకు అప్లై చేసుకుంటున్నారు. అలాంటివారు లేబర్ కార్డుకు అర్హులు కారు అనే విషయాన్ని గమనించగలరని జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) అధికారి బి.వాల్య వెల్లడించారు.

Next Story

Most Viewed