బీజేపీ నాయకులకు సరికొత్త భయం.. రాష్ట్ర నేతలను కలవాలంటే వణికిపోతున్న లోకల్ లీడర్స్..!

by Satheesh |
బీజేపీ నాయకులకు సరికొత్త భయం.. రాష్ట్ర నేతలను కలవాలంటే వణికిపోతున్న లోకల్ లీడర్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉన్నది. ఈ విజయం శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే అన్ని స్థానాల్లో గెలిచిన నేతలను కలిసి తమ సంతోషాన్ని పంచుకుందామంటే నాయకులు, కార్యకర్తలను కొత్త భయం వెంటాడుతున్నది. ఒక నేతను కలిస్తే మరో నేత ఫలానా వర్గమంటూ ముద్ర వేస్తారనే ఆందోళన వారిని వెంటాడుతున్నది. ఎవరిని కలిసినా ఇబ్బందే అనే భావనలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకవేళ కలిసినా చెప్పుకునేందుకు భయపడుతున్నారు. భవిష్యత్తులో తమ పొలిటికల్ కెరీర్‌కు ఇబ్బంది అని కొందరు భావిస్తుంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అనే భయం మరికొందరిని వెంటాడుతున్నది.

‘పవర్’ సెంటర్స్ ఎక్కువ..!

తెలంగాణలో బీజేపీ ఫేస్‌గా చెప్పుకునే కీలక నేతలంతా ఎంపీలుగా గెలిచారు. ఎనిమిది మందిలో ఇద్దరికి కేంద్ర మంత్రులుగా పార్టీ చాన్స్ కల్పించింది. వీరితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్య భారీగా పెంచుకున్న బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైంది. ప్రజాప్రతినిధులు పెరగడంతో పార్టీలో పవర్ సెంటర్స్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో నాయకులు, కార్యకర్తలు ఎవరిని కలిసినా ఇబ్బందే అని భావిస్తున్నట్లు సమాచారం.

కలవడానికి భయం

కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు ఎవరికి వారుగా పార్టీలో పవర్ సెంటర్స్ గానే చెప్పుకోవచ్చు. అయితే గెలిచిన ఎంపీలను అభినందించడానికి, సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నట్లు సమాచారం. ఒకరి మనిషిగా ముద్ర పడితే.. పొలిటికల్ కెరీర్‌కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని నాయకులు జంకుతున్నారు. ఫలానా వర్గానికి చెందిన మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ దక్కదేమోననే భయం నాయకులను వెంటాడుతున్నది. అందుకే గెలిచిన వారితో చాటుమాటుగా కలిసి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story