'మునుగోడులో TRS ఓటమి ఖాయమని కేసీఆర్‌కు తెలుసు'

by GSrikanth |
మునుగోడులో TRS ఓటమి ఖాయమని కేసీఆర్‌కు తెలుసు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ సర్కార్ వీడియో మార్ఫింగ్స్‌తో మునుగోడు ప్రజలను ఏమార్చలేరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తెలిశాకే సీఎం కేసీఆర్ జిత్తులమారి వేశాలు వేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రాజకీయ నైతికతకు కట్టుబడి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనని మాటలను అన్నట్లుగా వీడియోలను మార్ఫింగ్ చేసి ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పైగా ఆ మార్ఫింగ్ వీడియోలతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీలోకి రాకముందు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాని మోడీ పథకాలను సమర్థించారని తెలిపారు.

బీజేపీలో ఆయన చేరడానికి కాంట్రాక్టులకు, కాంట్రాక్టు పనులకు సంబంధం లేదని ఎప్పుడో స్పష్టం చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలని మునుగోడులో ఖర్చుపెట్టబోతోందని డీకే అరుణ ఆరోపణలు చేశారు. దాని నుంచి ఎన్నికల కమిషన్ దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తుంటేనే వారిలోని ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story