కంటోన్మెంట్ బైపోల్‌పై BJP ఫోకస్.. అభ్యర్థి అతనేనా?

by GSrikanth |   ( Updated:2024-04-12 06:43:09.0  )
కంటోన్మెంట్ బైపోల్‌పై BJP ఫోకస్.. అభ్యర్థి అతనేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ బై పోల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. గెలుపు గుర్రాన్ని బరిలోకి దింపి.. అక్కడ కాషాయ జెండా ఎగరేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే నారాయణన్ శ్రీగణేశ్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపుతున్నది. వీరికి గట్టి పోటీ ఇచ్చేలా పలువురి పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నది. వీరిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాష పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.

కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలని..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగణేశ్ బీజేపీ తరుఫున పోటీ చేసి ఓటమి తర్వాత పార్టీ వీడారు. మళ్లీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీలోకి వచ్చి.. పోటీ చేసి ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దీంతో అవసరానికి పార్టీలో వచ్చే గణేశ్ లాంటి వారికి కాకుండా.. పార్టీ కోసం కష్టపడే వారికి కంటోన్మెంట్ బైపోల్‌లో టికెట్ ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్న కొప్పు భాషకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందోనని పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

విద్యార్థి ఉద్యమాల నుంచి..

కొప్పు భాష దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా యాచారం ఆయన స్వగ్రామం. చిన్నతనం నుంచి జాతీయ భావాలు కలిగిన నేత. విద్యార్థి ఉద్యమాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1999 నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చురుకైన విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేసి కేసుల పాలయ్యారు. 2009లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేవైఎం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో యాచారం గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

గ్రామాభివృద్ధికి కృషిచేశారు. 2016 నుంచి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019లో యాచారం ఎంపీటీసీగా తన సతీమణిని గెలిపించుకున్నారు. ఇతర పార్టీల నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం పనిచేశారు. ఆయన పార్టీకి చేసిన కృషిని గుర్తించి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించారు. జనరల్ స్థానాల్లో అగ్రకులస్తులను దీటుగా ఎదుర్కొని ఆయన పలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. అందుకే పార్టీ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయిని తెలుస్తోంది.

Advertisement

Next Story