లిక్కర్ స్కామ్ vs మహిళా రిజర్వేషన్‌.. హస్తినలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న BRS, బీజేపీ!

by Satheesh |   ( Updated:2023-03-10 03:44:08.0  )
లిక్కర్ స్కామ్ vs మహిళా రిజర్వేషన్‌.. హస్తినలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న BRS, బీజేపీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ సరికొత్త టర్న్ తీసుకున్నది. ఒకదాన్ని మరొకటి కార్నర్ చేసేలా ఢిల్లీలో వేర్వేరు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. భారత్ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు దీక్ష చేపడుతున్నారు. దీనికి కౌంటర్‌గా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధమైంది. కవిత దీక్షకు జంతర్‌మంతర్‌ వేదిక కాగా, బీజేపీ నిరసనను దీనదయాళ్ మార్గ్‌లో నిర్వహించనున్నారు.

భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కావడంతో ఆమె దీక్ష కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినది గానే బీజేపీ భావిస్తున్నది. జంతర్‌మంతర్‌లో కవిత నిర్వహించనున్న దీక్షపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె ప్రమేయంపై చర్చలు జరుగుతుండడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వ్యాఖ్యానించారు.

లిక్కర్ వ్యాపారంలో వేలు పెట్టి అవకతవకలు, అక్రమాలకు పాల్పడినందునే ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలించిందన్నారు. మరోవైపు సౌత్ గ్రూపు పేరుతో ఢిల్లీ స్టేట్ ఎక్సయిజ్ పాలసీని మార్చి దొడ్డిదారిన రూ.వేల కోట్లు మళ్లించే కుట్రలో కవితదే కీ రోల్ అంటూ దీనదయాళ్ మార్గ్‌లో జరిగే నిరసన ప్రదర్శనలో కవితను బీజేపీ టార్గెట్ చేయనున్నది.

కేంద్రమే టార్గెట్‌గా విపక్షాల ఐక్యత

మహిళా రిజర్వేషన్ డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో జరిగే దీక్షలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి గ్రౌండ్ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదనే అంశాన్నీ హైలైట్ చేయడానికి పలు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సహా 18 ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారని కవిత పేర్కొన్నారు. హాజరయ్యే పార్టీల ప్రతినిధులు మహిళా రిజర్వేషన్ డిమాండ్‌పై మాట్లాడుతూనే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే చాన్స్ ఉన్నది.

ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా.. ఇంతకాలం చొరవ తీసుకోలేదని బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే అవకాశమున్నది. దీక్షకు రావాల్సిందిగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కవిత స్వయంగా కలిసి ఆహ్వానించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఈ డిమాండ్‌తో ఏకం చేయడానికి కవిత ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం (మాజీ) మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ ఖండించింది.

మరో ఏడు పార్టీలకు చెందిన ఎనిమిది మంది నేతల మద్దతును సైతం కేసీఆర్ సంపాదించగలిగారు. ఇప్పుడు ఈ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ అంశంతో కవితకు సహకారాన్ని అందించనున్నాయి. వీటికి తోడు డీఎంకే, జేడీయూ, అకాలీదళ్ తదితర మరో పది పార్టీల ప్రతినిధులు కూడా దీక్షకు వస్తారని కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూనే చివరకు దర్యాప్తు సంస్థలపైకి ఫోకస్ మళ్లే చాన్స్ ఉన్నది.

లిక్కర్ స్కామ్‌ టార్గెట్‌గా బీజేపీ ప్రొటెస్ట్

లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించడానికే జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేపట్టినట్టు భావిస్తున్న బీజేపీ.. దాన్ని మరింత ఎక్స్‌పోజ్ చేయాలని భావిస్తున్నది. ఇంతకాలం లేని రిజర్వేషన్ అంశాన్ని ఇప్పుడే ఎందుకు తెరపైకి తెస్తున్నారని ప్రస్తావించనున్నది. లిక్కర్ స్కామ్‌లో ఆమె ప్రమేయాన్ని ప్రజల్లో బహిర్గతం చేసేలా నిరసన ప్రదర్శనలో పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డులను ఢిల్లీ బీజేపీ శ్రేణులు ప్రదర్శించడానికి ప్రణాళిక సిద్ధం చేశాయి. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు పోషించిన పాత్ర, అందులో కవితతో పాటు మరో ఇద్దరి ప్రమేయం, వారి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టిన ముడపులు తదితరాలన్నింటినీ ఈ నిరసన ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నది.

అవినీతికి పాల్పడిన పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయనే ఆరోపణలను ఈ నిరసన ద్వారా బీజేపీ స్పష్టం చేయాలనుకుంటున్నది. మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్‌పై వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా గుర్తు చేయనున్నది. జంతర్‌మంతర్ దీక్షకు హాజరయ్యే పార్టీల సమాచారం ఇప్పటికే బీజేపీ వద్ద ఉన్నందున.. దీనదయాళ్ మార్గ్‌లో నిర్వహించే నిరసన.. పొలిటికల్ మీటింగ్‌గా జరగనున్నది. కవిత దీక్షలో పాల్గొనే పార్టీలు.. గతంలో అవినీతికి పాల్పడిన అంశాలను బీజేపీ ప్రస్తావిస్తూ లిక్కర్ స్కామ్‌లో కీ రోల్ పోషించిన కవితకు అవి మద్దతిచ్చే అంశాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నది.

చివరకు ఈ రెండు కార్యక్రమాలు బలప్రదర్శనకు నిదర్శనంగా మారనున్నాయి. ఐదారు వేల మంది జంతర్‌మంతర్ దీక్షకు వస్తారని కవిత అంచనా వేశారు. ఇదే స్థాయిలో దీనదయాళ్ మార్గ్ నిరసనకు కూడా జన సమీకరణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తొలుత కవిత దీక్ష పక్కనే నిరసన కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ భావించినా.. చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసుల సూచనతో వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. ఒక పార్టీ బండారాన్ని మరో పార్టీ వేలెత్తి చూపేలా పోటాపోటీ ప్రదర్శనలు జరగనున్నాయి.

Advertisement

Next Story