BIG News: ఆర్ అండ్‌ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి రిజైన్

by Shiva |   ( Updated:2024-09-04 15:49:07.0  )
BIG News: ఆర్ అండ్‌ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి రిజైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్అండ్‌బీ) విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఐ.గణపతిరెడ్డి (నేషనల్ హైవేలు) రాజీనామా చేయడం ఆ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. తన రిజైన్ లెటర్‌ను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాసరాజ్‌కు సోమవారం అందజేసినట్టు తెలిసింది. అయితే.. 2017లోనే రెగ్యులర్ పోస్టు నుంచి రిటైర్ అయిన గణపతిరెడ్డి సర్వీసును గత ప్రభుత్వం ఏడేండ్లు పొడిగించింది. ఇదే క్రమంలో వరంగల్‌లో నిర్మిస్తున్న నూతన ఆస్పత్రి భవన నిర్మాణానికి సంబంధించి అంచనాల పెంపుపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతోనే గణపతిరెడ్డి రాజీనామా చేశారని ఆ శాఖలోని ఉన్నతాధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.

కీలక ప్రాజెక్టుల నిర్మాణాలు..

బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 ఏళ్లపాటు గణపతిరెడ్డి పలు కీలక ప్రాజెక్టులను నిర్వర్తించారన్న పేరుంది. ఆయన ఆధ్వర్యంలోనే స్టేట్ సెక్రెటేరియట్, ప్రగతిభవన్, 25 జిల్లాల కలెక్టరేట్లు, 110కి పైగా ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగాయి. అయితే.. వరంగల్ మెడికల్ కాలేజీ అంశంలోనూ ఆయన గత ప్రభుత్వం ఆదేశాల మేరకే కార్యకలాపాలు చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ఏ మెడికల్ కాలేజీ అయినా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు 16 ఫ్లోర్లు మాత్రమే ఉండాల్సి ఉన్నా.. గత ప్రభుత్వంలోని ‘పెద్దాయన’ ఆదేశాల మేరకు 20 ఫ్లోర్లు నిర్మించతలపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఒక ‘పెద్ద తలకాయ’ ఒత్తిడి మేరకు గణపతిరెడ్డి మీదకు ఈ అంశాన్ని తీసుకువచ్చినట్టు చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వంలో ‘పెద్దాయన’తో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించిన గణపతిరెడ్డి.. ఈ ప్రభుత్వం రాగానే తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని అడిగారు. అయితే.. అప్పుడు ప్రభుత్వం ఆయన సేవలు అవసరం ఉన్న దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయలేదు. తాజాగా ఆయన రాజీనామా చేసిన పరిణామాలు చూస్తే సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా..

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, స్కిల్ వర్సిటీ, ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీ నుంచి ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ నిర్మాణం వంటివి ప్రభుత్వం చేపట్టాలని అనుకుంటున్నది. ఈ సమయంలో గణపతిరెడ్డి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. కాగా.. గణపతిరెడ్డి రాజీనామాతో ఇన్‌చార్జి బాధ్యతలను అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ మధుసూదన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story