Rain Alert: ఎల్లుండి మరో అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు

by Shiva |   ( Updated:2024-09-03 15:39:53.0  )
Rain Alert: ఎల్లుండి మరో అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్రంలో వర్ష, వరద బీభత్సం సృష్టించిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఈ నెల 5న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈసారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది ఏర్పడనున్నదని తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపైనే ఉంటుందని, ఒడిశాపై స్వల్పంగానే ఉండొచ్చని రాడార్ ప్రెడిక్షన్‌కు అనుగుణంగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీని కారణంగా ఈ నెల 5వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అలర్టు చేశారు.

ఈ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సైతం అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బంది సెలవుల విషయంలో ఆలోచించాలని, ప్రజలకు సేవలందించడంపై ఫోకస్ పెట్టాలన్నారు. మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా 11 జిల్లాల్లో మోస్తరుకంటే ఎక్కువగానే కురిసే అవకాశముందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీచేసింది. సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.

సీఎస్ సమీక్ష..

పలు జిల్లాల్లోని వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత నాలుగైదు రోజులుగా వర్షాలు కంప్లీట్ కాకముందే రానున్న భారీ వర్షాల పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని అలర్ట్ చేశారు. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయమై జిల్లా కలెక్టర్లు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నారు.

స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌కు 31 మంది సభ్యులతో కూడిన నాలుగు బోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని మరింత పెరిగితే పరివాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే నీటి ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధిత అధికారులతో జాయింట్ టీమ్ లను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలన్నారు.

Advertisement

Next Story