- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big News: ఫార్మాసిటీకి భూదాన్ భూములు..? 250 ఎకరాలు అప్పనంగా కలిపేసి పరిహారం
దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మసిటీ భూసేకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. కందుకూరు, యాచారం మండలాల్లో సేకరించిన వేలాది ఎకరాల భూమి, నష్టపరిహారం చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా.. భూదాన్ భూములకూ నష్టపరిహారం చెల్లించారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను ఫార్మా సిటీలో కలిపేశారు. భూదాన్ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని భూదాన్ యజ్ఞ బోర్డు చట్టంలో ఉంది. అయినా.. రెవెన్యూ అధికారులు మాత్రం రికార్డుల ప్రకారమే చేశామంటూ భూ సేకరణ తతంగాన్ని ముగించారు. తాటిపర్తి సర్వే నంబర్ 104లో 250 ఎకరాల భూమిని దాతలు భూదాన్ యజ్ఞ సమితికి దానం ఇచ్చారు. ఈ భూమిని బొక్కా సీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, కిషన్‌రెడ్డి, ఇతరులు కలిసి అందించారు.
భూదాన్ యజ్ఞ బోర్డు లేఖ..
2006 జనవరి 12న తాటిపర్తి సర్వే నంబర్ 104, 172లో భూదానంగా ఇచ్చిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, వెంటనే క్రయవిక్రయాలను నిలిపివేయాలని యాచారం తహశీల్దార్‌కు భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి లేఖ రాశారు. అందుకు సంబంధించిన భూదాన పత్రాలను కూడా అందజేశారు. 2023 ఏప్రిల్ 12న 250 ఎకరాల భూమిని భూదాన్ చట్టానికి వ్యతిరేకంగా అమ్మకాలు సాగిస్తున్నారని, ఎన్నో ఏండ్లుగా దళితులు, బీసీలు దున్నుకుంటున్నారని రంగారెడ్డి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా అది కంచెగానే ఉందని గుర్తు చేశారు.
ప్లాట్ల జాబితాలో లీడర్స్
2023 మార్చి 24న తాటిపర్తి సర్వే నంబర్ 104లో ప్లాట్లు పంపిణీ చేయొద్దని ఆర్డీవోకు లిఖితపూర్వకంగా మాజీ సర్పంచ్ దూస రమేశ్ అర్జీ పెట్టుకున్నారు. అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరికీ ప్లాట్లు ఇవ్వొద్దని కోరారు. భూదాన్ ఉద్యమ సమయంలో 250 ఎకరాల భూమి దాతలు ఇచ్చారని, అది పేదలకు పంపిణీ చేశారని వెల్లడించారు. అనేక ఏండ్లుగా పేదలు వ్యవసాయం చేసుకుంటున్నారని, వారిని కాదని అనర్హులకు నష్టపరిహారం అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యితే.. ఆ భూమిని ఎవరికీ అసైన్ చేయలేదంటూ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు తరఫున అదనపు అసిస్టెంట్ కమిషనర్ సమాచార హక్కు చట్టం సమాధానం ఇచ్చారు. లేఖ నం.TBYB/A/141/2023 ద్వారా భూ సేకరణ కోసం చేపట్టిన గ్రామ సభ, ఆ తర్వాత కూడా సర్వే నం.104లోని భూదాన్ భూములపై ప్రజలు సమాచారం ఇస్తూనే ఉన్నారు. పలుసార్లు లిఖితపూర్వకంగా ఈ భూములపై వివాదాన్ని గుర్తు చేశారు. ఫార్మా సిటీ కింద వేలాది ఎకరాల భూమిని సేకరించారు.
ఈ క్రమంలోనే భూమిని కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలిస్తామన్నారు. దానికిగాను లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ జాబితాలో తాడిపర్తికి చెందిన లబ్ధిదారులతోపాటు ఇతరులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఈ సర్వే నంబర్ 104లో భూమి ఏ విధంగా సంక్రమించిందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అది భూదాన్ భూమి అని తెలిసినప్పటికీ వాళ్లకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అనేది తెలియకుండా ఉంది. అలాగే.. ఈ జాబితాలో బడా నాయకుల పేర్లు ఉండడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో చాలా మంది నష్టపరిహారం సైతం పొందారు. అయితే ఒకరిద్దరు మాత్రం ఇది వివాదాస్పదంగా ఉందని, పంచాయితీ తేలిన తర్వాతే నష్టపరిహారం సొమ్ము తీసుకుంటామని పెండింగులో పెట్టారు. ఈ జాబితాలోని పేర్లను తాము గ్రామంలో ఎప్పుడూ వినలేదని, వారెవరో కూడా తమకు తెలియదని తాడిపర్తి మాజీ సర్పంచ్ చెప్తున్నారు. కాగా.. ఔటర్స్‌గా చెప్పుకుంటున్న వారి పేరిట ఈ సర్వే నంబరులోనే 20 ఎకరాల వరకు భూమి ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల సతీమణుల పేర్లు కూడా కనిపించడం గమనార్హం. 250 ఎకరాల్లో భూదాన్ భూమి ఉందని తెలిసి కొనుగోలు చేశారా? వివాదాస్పదమని తెలిసినప్పుడే ఆ భూములను కొనుగోలు చేశారా? అన్నది చర్చకు దారితీసింది.
అధికారుల మధ్య తేడా
తాటిపర్తిలోని భూదాన్ భూముల వివరాలపై మాజీ సర్పంచ్ దూస రమేశ్ సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించారు. సీసీఎల్ఏ కార్యాలయంలోని భూదాన్ యజ్ఞ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారంలో సర్వే నం.104లో 250 ఎకరాల భూమి భూదానమేనని స్పష్టం చేశారు. అయితే.. ఎవరికీ అసైన్ చేయలేదన్నారు. అటు రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పట్టాగానే నమోదు చేశారు. కనీసం భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజ్ఞ బోర్డు ఆ భూమిపై నిషేధం విధించాలని లేఖ రాసినప్పుడు అధికారులు స్పందించలేదని తెలుస్తున్నది. ఆనాడే కనీసం ఆ భూములపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటే ఇప్పుడీ వివాదం తలెత్తేది కాదు. ఫార్మా సిటీ భూ సేకరణలో అత్యంత కీలకంగా పని చేసి, అప్పటి ప్రభుత్వ పెద్దల మన్ననలు అందుకున్న ఆర్డీవో వెంకటాచారి ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తులకు కోట్లలో పరిహారం
మొత్తానికి ప్లాట్ల జాబితాలో లీడర్లు, వారి బినామీల పేర్లు ఉన్నాయంటే రూ.కోట్ల నష్టపరిహారం పొందిన వారు కూడా వీరేనని అర్థం చేసుకోవచ్చు. వీళ్లకు ఆ భూములు ఎలా దక్కాయో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అయినా ఆర్డీవోగా పనిచేసిన వెంకటాచారి, కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్ నష్టపరిహారం చెల్లించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని మాజీ సర్పంచ్ దూస రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు పరిహారం చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ భూములపై ఏళ్లుగా వివాదం నెలకొనగా.. అధికారులు మాత్రం చాలా చాకచక్యంగా పనిని పూర్తిచేశారు. దీనిపై లోకాయుక్తకు తాటిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేశ్ ఫిర్యాదు చేశారు.
భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, పేదలకు న్యాయం చేయాలని కోరారు. 250 ఎకరాల భూదాన్ భూమికి ఎకరానికి రూ.16 లక్షల వంతున నష్టపరిహారాన్ని అనర్హులకు అందించారని ఆరోపించారు. సుమారు రూ.40 కోట్లు చేతులు మారిందని బాధిత రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ 77 మంది రైతులు సంతకాలు చేసి కలెక్టర్‌కూ ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్‌తోపాటు రైతు సంక్షేమకమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి 2023 ఆగస్టు 23న ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భూములకు సంబంధించి ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కానీ.. వారు మాత్రం నేటికీ స్పందించడం లేదు.
ఈ తతంగం వెనుక అమోయ్ కుమార్..
ఈ భూముల అన్యాక్రాంతం వెనుక రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవోగా పనిచేసిన వెంకటాచారి బాధ్యులని అక్కడి ప్రజలు ఆరోపించారు. భూదాన్ భూములని తెలిసి కూడా అక్రమార్కులకు నష్టపరిహారం ఇచ్చారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. అది భూదాన్ భూములని సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారాన్ని కూడా జత చేశారు. లోకాయుక్తతోపాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల లోకాయుక్తాలో విచారణ జరిగింది. మరింత స్పష్టత ఇచ్చేందుకు, నిజానిజాలు తెలిపేందుకు మరో రెండు నెలల సమయం కావాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కోరారు.
ఇది పెద్ద భూ కుంభకోణం: ఎం.కోదండరెడ్డి, చైర్మన్, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్
ఫార్మా సిటీ భూ సేకరణలో పెద్ద భూ కుంభకోణం. కేసీఆర్‌కు నమ్మినబంటులా ఉంటూ కొందరు అధికారులు అక్రమాలు చేశారు. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు కూడా లబ్ధిపొందారు. రిజిస్ట్రేషన్ సమయంలో క్లాసిఫికేషన్ చూడకుండా చేసేశారు. కొందరు కోర్టుకు వెళ్లారు. భూదాన్ ల్యాండ్ అని అధికారులకు తెలుసు. భూ సేకరణ చేయొద్దని మేం చెప్పాం. గైడ్స్ లైన్స్ పట్టించుకోలేదు. 250 ఎకరాలపై పేచీ ఉంది. అది భూదాన్ ల్యాండ్. ఇందులో నష్టపరిహారం ఎవరు తీసుకున్నారు? అర్హులా? కాదా? ఎవరికి ఎంత ముట్టింది? చట్టం విరుద్ధంగా సర్కారీ కంచె అని ఉండగా పట్టా అని నిర్దారించడం వెనుక దందా నడిచింది. దీనికి కారణం ఆర్డీవోగా పని చేసిన వెంకటాచారి. అప్పుడు కలెక్టర్ గా అమోయ్ కుమారే ఉన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
మాకు న్యాయం చేయాలి : దూస రమేశ్, మాజీ సర్పంచ్, తాటిపర్తి
మేం ఇది భూదాన్ ల్యాండ్ అని మొదటి నుంచి చెప్తున్నాం. గ్రామసభలోనూ అందరం చెప్పాం. అయినా మా మాట వినకుండా అధికారులు భూ సేకరణ చేశారు. నష్టపరిహారం పొందిన వాళ్లలో అనేక మంది స్థానికేతరులు ఉన్నారు. వారికి ఆ భూమి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎన్నోసార్లు అధికారులకు న్యాయం చేయాలని కోరాం. ఎన్నో ఏండ్లుగా ఆ భూములను దున్నుకుంటూ బతుకుతున్న ఎస్సీ, బీసీ రైతులు ఉన్నారు. వారికే కేటాయించాలి. అందుకే మేం లోకాయుక్తా, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం.