Big Breaking: రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి వారి వివరాల సేకరణ కొరకు కొత్త యాప్

by Kavitha |
Big Breaking: రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి వారి వివరాల సేకరణ కొరకు కొత్త యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక, ఇతర కారణాల వల్ల మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది.

ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్‌కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా రూ. 2లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామని వెల్లడించలేదు.

Advertisement

Next Story