BIG BREAKING: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద ముప్పు.. నీట మునిగిన వెంకటాద్రి పంప్ హౌజ్

by Shiva |   ( Updated:2024-09-03 15:44:57.0  )
BIG BREAKING: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద ముప్పు.. నీట మునిగిన వెంకటాద్రి పంప్ హౌజ్
X

దిశ, వెబ్‌డెస్క్/నాగర్ కర్నూల్: గడిచిన 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం 4,700 ఎకరాలతో సాగునీరందించేందుకు 16.8 టీఎంసీ నీటి సామర్థ్యం గల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం రిజర్వాయర్‌ను నిర్మించింది. తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామ సమీపంలోని సొరంగ మార్గం ద్వారా వరద నీరు అండర్ గ్రౌండ్ టర్నల్ లోపలికి ప్రవేశించాయి.

అప్పటికే పనులు ముగించుకున్న సిబ్బంది అందరూ బయటనే ఉండడంతో భారీ వాహనాలు హిటాచీలు వంటివి అండర్ గ్రౌండ్‌లోనే ఉండిపోయాయి. ఆదివారం సాయంత్రం వరద నీరు శ్రీపురం అండర్ గ్రౌండ్ టన్నెల్ మీదుగా ఉయ్యాలవాడ టన్నెల్ నుంచి మూడో లిఫ్ట్ వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌజ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో మోటర్లు అన్ని వరద నీటిలోనే చిక్కుకుపోయాయి. దాదాపు 34 కి.మీ అండర్ టన్నెల్‌లోకి నీరు చేరింది. దీంతో వట్టెం రిజర్వాయర్ అధికారులు అప్రమత్తమై నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో నీరు బయటికి తీస్తే ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారం మేరకు సుమారు రూ.10 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. వరద నీటిని పూర్తిగా బయటికి పంపితేనే మోటార్ల పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు.

Advertisement

Next Story