KTRకు బీసీల టెన్షన్.. టికెట్ కేటాయింపు డిమాండ్‌తో కొత్త చిక్కులు..!

by Rajesh |
KTRకు బీసీల టెన్షన్.. టికెట్ కేటాయింపు డిమాండ్‌తో కొత్త చిక్కులు..!
X

దిశ, సిరిసిల్ల : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో ఐదోసారి సిరిసిల్లలో విజయ ఢంకా మోగించి కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారని విషయం రాష్ట్రవ్యాప్తంగా వినబడుతోంది. అయితే కేటీఆర్‌కు కంచుకోటలా ఉన్న సిరిసిల్లలో బీసీల సెగతో ఎన్నికల్లో గడ్డుకాలమే ఎదురవుతుందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచి రాజకీయ అరంగేట్రం చేసిన కేటీఆర్, 2018లో ఎన్నికల్లో 89 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా..? ఒకవేళ గెలిచినా? మెజారిటీ రాకపోవచ్చునని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సిరిసిల్లలో పద్మశాలీల ఆకలి కష్టాలను తీర్చిన కేటీఆర్‌కు ఈసారి పద్మశాలీల మద్దతు ఉంటుందా..? సిరిసిల్ల రూపురేఖలు మార్చిన కేటీఆర్‌కు బీసీలు అండగా నిలబడతారా? అని చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో సిరిసిల్లలో మారుతున్న రాజకీయ పరిణామాలు కేటీఆర్‌కు సవాల్‌గా మారాయి.

పద్మశాలీల ఓట్లు ఎటువైపు?

రాష్ట్రవ్యాప్తంగా 40లక్షలకు పైగా ఉన్న పద్మశాలీలు ఏకమై వారి అధికారం కోసం గలమెత్తుతున్నారు. కోరుట్లలో జరిగిన పద్మశాలి మహాగర్జన సభే అందుకు నిదర్శనం. కోరుట్లలో జరిగిన సభలో లక్ష మందికి పైగా పద్మశాలీలు పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేసిన విషయం తెలిసిందే. మేమెంతో.. మాకంత అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా తమ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు రాజకీయ పార్టీలు కేటాయించాలని, లేనిపక్షంలో ఆ రాజకీయ పార్టీకి మద్దతు ఉండబోదని సభలో తీర్మానించుకున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అభ్యర్థిగా బరిలో ఉంటారో వారి గెలుపునకు కృషి చేయాలని, కోరుట్ల సభలో పద్మశాలి నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సిరిసిల్లలో దాదాపు 80వేలకు పైగా ఓట్లు ఉన్న పద్మశాలీలు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకుని ఏకపక్ష నిర్ణయంతో కలిసి ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు పెద్దదెబ్బ పడుతుందని పలు రాజకీయ పార్టీల్లో చర్చ నడుస్తోంది. గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా పద్మశాలీలు కేటీఆర్‌కు వ్యతిరేకంగా మారినట్లు సమాచారం. బతుకమ్మ చీరెల తయారీతో తమ ఆకలి కష్టాన్ని తీర్చిన కేటీఆర్‌కు పద్మశాలీలు అండగా ఉంటారో? లేదో? వేచి చూడాలి.

ముదిరాజులు మాట నిలబెట్టుకునేనా?

సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా ముదిరాజులు భారీ ఎత్తున ర్యాలీ తీసి, ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆ సభలో పెద్ద ఎత్తున ముదిరాజులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు సిరిసిల్ల నుంచి 41 బస్సుల్లో ముదిరాజులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఒక్క టికెట్టు కూడా కేటాయించని అధికార పార్టీకి అతీతంగా ఏ రాజకీయ పార్టీలు అయితే ముదిరాజులకు అవకాశం కల్పిస్తాయో, ఆ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా సమిష్టిగా గెలిపించుకోవాలని ఈ సభలో నిర్ణయం తీసుకున్నారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ముదిరాజులకు సుమారు 45వేల ఓట్లు ఉన్నాయి. ఒకవేళ ముదిరాజులు తీసుకున్న నిర్ణయంపై బలంగా ఉంటే సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు సవాలుగా మారనుంది. సిరిసిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్‌కు ముదిరాజులతోపాటు మిగతా బీసీల మద్దతు ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.

పార్టీ మారుతున్న నేతలు...

పార్టీలోని కొందరు కీలక నేతల వ్యవహారం వల్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నేతల పెత్తనం వల్ల తమ సమస్యలు కేటీఆర్ వద్దకు వెళ్లడం లేదని కొందరు నేతలు పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో కీలక నేతలు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాయకుల మధ్య అంతర్గత విబేధాలు కూడా ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. కొందరు అధికార పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పేదల భూములను కబ్జాలు చేస్తున్నారని, ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అలాంటి వారిపై కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed