పోచారం కాంగ్రెస్‌లో చేరడానికి అసలు కారణం అదే.. BRS మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
పోచారం కాంగ్రెస్‌లో చేరడానికి అసలు కారణం అదే.. BRS మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి చెప్పిన కారణాలు చూస్తే మాకు సిగ్గు వేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనేనని అన్నారు. పోచారం తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును సీనియర్ నాయకుడు పోచారం ఎందుకు మరచిపోయారోనని, బాన్సువాడ ప్రచారంలో రేవంత్ పోచారం కుటుంబాన్ని దండు పాళ్యం బ్యాచ్‌తో పోల్చారని గుర్తు చేశారు.

కానీ కేసీఆర్ పోచారంకు స్పీకరు పదవి ఇవ్వడంతో పాటు లక్ష్మీ పుత్రుడని బిరుదు ఇచ్చి గౌరవించారన్నారు. వ్యవసాయ మంత్రిగా పోచారంకు కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ వృద్ధాప్యంలో పోచారం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం తక్కువ చేశారని ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని పోచారాన్ని నిలదీశారు. స్వార్థం కోసమే పోచారం పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పోచారం పోవడం వల్ల బీఆర్ఎస్‌కు నష్టం లేదు.. కాంగ్రెస్‌కు లాభం లేదని సెటైర్ వేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోచారం రాకను జీర్ణించుకోవడం లేదని అన్నారు.

ఇసుక దందాలు సాగడం లేదనే పోచారం పార్టీ మారుతున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయడం చేత కాక రేవంత్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోచారంకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని.. నేనే బీఆర్ఎస్ నుంచి బరి లోకి దిగుతానని సవాల్ విసిరారు. ఆరు నెలల్లోనే రేవంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ మళ్ళీ అదే రాజకీయం మొదలు పెట్టారని.. ఇకపై ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed