బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీల మాయాజాలం.. రూ.వందల కోట్ల వసూళ్లకు ప్లాన్ ?

by Mahesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీల మాయాజాలం.. రూ.వందల కోట్ల వసూళ్లకు ప్లాన్ ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో సీట్ల కన్వర్షన్ సాకుతో వందల కోట్లు సొమ్ము చేసుకోవాలని ఆ ఇద్దరు లీడర్లు వేసిన ప్లాన్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తున్నది. ఇంతకాలం రూలింగ్ లో ఉన్న సదరు లీడర్లు తమకు ఉన్న పలుకుబడితో సీట్ల కన్వర్షన్ ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఆ సంస్థల ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన శాస్తి జరిగిందనే చర్చ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మధ్య జరుగుతున్నది.

సీట్ల కన్వర్షన్ తో కోట్ల వ్యాపారానికి ప్లాన్..

సీట్ల కన్వర్షన్ తో గులాబీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పేరుతో వందలాది కోట్లను వసూలు చేయొచ్చని ఆశ పడ్డాయి. కానీ ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాలను ముందుగానే పసిగట్టి, కోర్సుల కన్వర్షన్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు, రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించినందుకు పాత కోర్సుల సీట్లకు సైతం కోత పెట్టింది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే, మేనేజ్మెంట్ కోటాలో లక్షల్లో ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన విద్యా సంస్థలు చక్రం తిప్పాయి. ఆ రెండు కాలేజీల్లో అంతగా డిమాండ్ లేని ఇతర బీటెక్ కోర్సులకు చెందిన సుమారు 2 వేల సీట్లను, కంప్యూటర్ సైన్స్ (బీటెక్) కోర్సులకు మార్చుకునేందుకు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతి ఇవ్వగా, ప్రభుత్వం మాత్రం నో చెప్పింది.

ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు

కోర్సుల కన్వర్షన్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లకు చెందిన కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. ఏఐసీటీఈ, జేఎన్టీయూ క్లియరెన్స్ ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఎందుకు కన్వర్షన్ చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కి చెందిన కాలేజీలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లాలో ఉన్న ఇతర ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో తుది కౌన్సిలింగ్ నాటికి కన్వీనర్ కోటా లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్ల వివరాలను కోర్టుకు సమర్పించింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు కావాల్సిన సంఖ్యలో సీట్లు మేడ్చల్ జిల్లాలో ఉండగా, కోర్సుల కన్వర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో తెలిపింది. దీంతో కోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది.

ఫీజు వెనక్కి ఇస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు

కోర్సుల కన్వర్షన్ జరుగుతుందని ఆశతో గులాబీ ఎమ్మెల్యేలు ముందుగానే మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను అమ్ముకున్నాయని టాక్ ఉంది. ఒక్కో సీటుకు డొనేషన్ కింద పేరెంట్స్ నుంచి రూ. 6 నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కానీ సీట్ల కన్వర్షన్ జరగకపోవడంతో చెల్లించిన ఫీజు ఇవ్వలేమని కాలేజీలు మొండికేయగా, పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో వెనక్కి ఇస్తున్నట్టు సమాచారం.

నాడు ఆడిందే ఆట

బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీ హోదాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి హోదాలో మల్లారెడ్డి విద్యాశాఖను శాసించేవారనే ఆరోపణలు ఉండేవి. తమ విద్యా సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేసేవారని విమర్శలు ఉన్నాయి. రూలింగ్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు సైతం చెప్పినట్టుగా నడుచుకునేవారు. దీంతో కోర్సుల కన్వర్షన్ కు సంబంధించిన ఫైల్స్ రోజుల వ్యవధి తేడాతోనే క్లియరెన్స్ అయ్యేవి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ రెండు విద్యా సంస్థల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టిందనే చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed