తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచనలం.. స్థానిక సంస్థల ఎన్నికలతోనే కూటమి ప్రయోగం?

by Prasad Jukanti |
తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచనలం.. స్థానిక సంస్థల ఎన్నికలతోనే కూటమి ప్రయోగం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పొత్తు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కూటమిపై చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనను అధిష్టానం తేలుస్తుందని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో కూటమి కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠమే టార్గెట్ గా పెట్టుకున్న తెలంగాణ కమలనాథులు పవన్ కల్యాణ్ అభిప్రాయంతో ఏకీభవిస్తే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో అనేది సస్పెన్స్ గా మారింది.

టోటల్ సినారియో చేంజ్!

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు కొత్త అంశమేమి కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా జనసేనకు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీకే దూరంగా ఉండగా ఏపీలో మాత్రం బీజేపీ, జనసేనకు టీడీపీ తోడు కావడంతో ఈ కూటమి బంపర్ విక్టరీ సాధించింది. ఈ మూడు పార్టీల కూటమి ఫ్యాక్టర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియోను మార్చివేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసుతం అక్కడ ఈ మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో కలిసి వెళ్తున్నాయి. కూటమి ఐక్యత పట్ల ప్రజల్లోనూ పాజిటివ్ సెన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కాంబినేషన్ తెలంగాణలో రిపీట్ చేసి చూడాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు కలిపి పని చేస్తే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలోనూ భారీ మార్పులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ విషయంలో టీడీపీ నిర్ణయం ఏంటో అనేది కూడా ముఖ్యం కాబోతున్నది.

స్థానిక సంస్థల్లో ప్రయోగం?:

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం కాంగ్రెస్, బీజేపీ చుట్టూ ప్రధానంగా తిరుగుతోంది. బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతున్న వేళ కారు పార్టీని భూస్థాపితం చేస్తామని కాంగ్రెస్ చెబుతుంటే.. బీఆర్ఎస్ స్థానాన్ని క్రమంగా తాము ఆక్యుపై చేసుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీ బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా లోక్ సభ ఎన్నిక్లలోనూ 8 స్థానాలు సాధించి దూకుడు మీదుంది. ఇక పవన్ కు తెలంగాణలో అభిమాన బలం ఉండగా టీడీపీకి క్యాడర్ స్ట్రెంత్ ఉంది. ఈ మూడు పార్టీల కాంబినేషన్ తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పై వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి కూటమి ప్రయోగాన్ని మరోసారి పరీక్షించబోతున్నారా అనేది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో సక్సెస్ సాధించిన కూటమి పాలిటిక్స్ తెలంగాణలో ఏమేరకు చక్రం తిప్పబోతున్నాయి? వీటికి ఇక్కడి అధికార కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టబోతున్నది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

టీ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ?

తెలంగాణలో జనసేన బలోపేతంపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ జనసేన నేతలతో భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. నిన్న కొండగట్టుకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోనే ఉండనున్న పవన్.. తెలంగాణ జనసేన నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో పార్టీ కార్యచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసి వైసీపీని గద్దె దించిన పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ ఇచ్చే సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని తెలంగాణ జనసేన నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed