సంజయ్ అరెస్టుపై పోరుకు కార్యకర్తలంతా సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Hamsa |
Kishan Reddy lashes out at TRS Flexi Politics
X

దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ ఈనెల 8వ తేదీన ఉందని, ఈ తరుణంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైల్లో ఉన్నారని, అయినా నాయకులు, కార్యకర్తలు సభను సక్సెస్ చేసి తమ సత్తా ఏంటో బీజేపీకి చాటాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ నిరసిస్తూ.. బీఆర్ఎస్ పై పోరాటంలో భాగస్వామ్యమవుతామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ స్థాపించినప్పుడు జాతీయ వాదం కోసం పోరాటం చేసే పార్టీ తప్ప అధికారంలోకి రాదని చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. తీవ్రవాదానికి , మతోన్మాదానికి వ్యతిరేకంగా తాము పోరాటాలు చేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులందరికీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వద్దన్న మజ్లీస్ తో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని, ఇది తాము చెప్పడం లేదని, బీఆర్ఎస్ నాయకులే చెబుతున్న విషయాన్ని వివరించారు.

రాష్ట్ర ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. మజ్లిస్ తో కలిసి బీజేపీని అణచివేయాలని చూస్తున్నారని, ఆ కుట్రలో భాగంగానే బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఫైరయ్యారు. సంజయ్ తరపున పోరాటం చేసేందుకు తమ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed