అలర్ట్ : ఆ వాహనాలను రోడ్లమీదికి తెస్తే.. స్క్రాప్ సెంటర్లకే!

by Sathputhe Rajesh |
అలర్ట్ : ఆ వాహనాలను రోడ్లమీదికి తెస్తే.. స్క్రాప్ సెంటర్లకే!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పదిహేనేళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసినట్టు తెలియజేసింది. అలాంటి వాహనాలను రోడ్ల మీదికి తెస్తే అధికారులు సీజ్ చేస్తారని, ఆ తర్వాత వాటిని స్ర్కాప్ సెంటర్లకు తరలిస్తారని వెల్లడించింది.

పబ్లిక్ సెక్టార్‌లోనే 9 లక్షల వాహనాలు

ప్రస్తుతం మన దేశంలో వాహనాల సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంటుందని అధికారవర్గాల అంచనా. వీటిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, హెవీ వెహికిల్స్ ఉన్నాయి. అయితే వీటిలో 3-5 శాతం వాహనాల కాలపరిమితి ముగిసి ఉంటుందని భావిస్తున్నారు. సుమారు 9 లక్షల వాహనాలు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతోపాటు, ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాహనాలే కావడం గమనార్హం. ఏప్రిల్ 1 తర్వాత ఈ వాహనాలను రోడ్లమీదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది.

కాలుష్య కారకాలు..

పదిహేనేళ్లు దాటిన ఆర్టీసీ బస్సులు మొదలుకుని లారీలు, ఆటోలు, పాత కార్లు, వివిధ సరుకు రవాణా వాహనాలు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి వాహనాల నుంచి విడుదలవుతున్న కార్బన్ మోనాక్సయిడ్, నైట్రోజన్ ఆక్సయిడ్, పూర్తిగా దహనమవని గ్యాసోలిన్, కార్బన్ డయాక్సయిడ్ వల్ల శ్వాస కోశ, క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. ఈ కాలుష్యం ఓజోన్ పొరను కూడా దెబ్బ తీస్తున్నది. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్నది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఇథనాల్, మిథనాల్, బయో ఈఎన్జీ, బయో ఎల్ఎన్‌జీ, ఎలక్ర్టికల్ వాహనాలను ఉపయోగించాలని కేంద్రం సూచిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed