ముందుంది ధరల మోత..భయపెడుతున్న ఆర్బీఐ నివేదిక

by Y. Venkata Narasimha Reddy |
ముందుంది ధరల మోత..భయపెడుతున్న ఆర్బీఐ నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో ఆర్థిక భారాన్ని మోస్తున్న సామాన్యులకు ఆర్బీఐ నివేదిక మరింత భయపెట్టేదిగా ఉంది. కూరగాయల ధరలపై ఆర్బీఐ నిర్వహించిన అధ్యయనంలో టమాటా, ఉల్లి, ఆలూ ధరలు సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో అత్యధికంగా పెరుగుతున్నాయని, ఆలూ ధరలు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో గరిష్ట స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. టమాటా, ఉల్లి, ఆలూ ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూరగాయల ద్రవ్యోల్భణం కూడా తక్కువగానే ఉందని పేర్కొంది. రిజర్వు బ్యాంకుకు చెందిన ఎకానమిక్‌ అండ్‌ పాలసీ రీసెర్చి విభాగం ఈ అధ్యయన నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో టమాటా, ఉల్లి, ఆలూ ధరలే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.ఆంగ్ల భాషలో ఈ మూడింటి మొదటి అక్షరాలను కలిపి (టిఓపి-టాప్‌)గా ఆర్బీఐ పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా ‘టాప్‌’ అంటే టమాటా, ఉల్లి, ఆలూ ధరలు చుక్కలు దాటి ఎలా పరుగులు తీస్తున్నాయో ఈ నివేదికలో వివరంగా వెల్లడించింది.

సాధారణంగా కూరగాయల ధరలు పెరిగితే ఆహార ద్రవ్యోల్భణం పెరుగుతుందని, కూరగాయల ధరల్లోనూ ఆ మూడింటి ధరల ప్రభావమే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు వీటి ధరల్లో సగటున 30 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆర్బీఐ అధ్యయన నివేదిక మేరకు 10 రోజల క్రితం వరకు కిలో రూ.20 నుంచి 30 రూపాయలుగా ఉన్న టమాటా ధర తాజాగా రూ.100కి చేరువైంది. అటు ఉల్లిపాయల ధర శనివారం రూ.40-రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.80కి చేరుకుంది. వర్షాలు, వరదల కారణంగా ఇతర రాష్ట్రాల్లో కూరగాయల దిగుబడి తగ్గింది. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మునుముందు టమాటా, ఉల్లి, ఆలుగడ్డల ధరలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తుండటం సామాన్య ప్రజలను కలవరపెట్టేదిగానే ఉందంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story

Most Viewed