భయమా? వ్యూహమా? హాట్ టాపిక్‌గా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-12 06:12:32.0  )
భయమా? వ్యూహమా? హాట్ టాపిక్‌గా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదనే చర్చ ఆ పార్టీలోనే ముమ్మరంగా జరుగుతున్నది. మూడుసార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ జాబితాను కొలిక్కి తెచ్చినా పేర్లు ప్రకటించడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదనేది ఆ పార్టీ నేతల్లో సందేహాలకు దారి తీస్తున్నది. అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి భగ్గుమంటుందనే కారణంతో ఏఐసీసీ ఆచితూచి అడుగులేస్తున్నదా?..

అన్ని సెక్షన్ల ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నందుకే అభ్యర్థుల ప్రకటన వాయిదా వేస్తున్నదా?.. లేక టికెట్ రాని ఆశావహులు పార్టీని వీడతారని భయపడుతున్నదా?.. లేదంటే బీఆర్ఎస్‌ను టెన్షన్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదా?.. సామాజిక సమీకరణాలతో అందరికీ సమన్యాయం చేయలేకపోతున్నామనే భావనతో అధిష్టానం ఆలస్యం చేస్తున్నదా?.. ఇలాంటి అనేక అనుమానాలు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.

కత్తిమీద సాములా..?

అభ్యర్థులను ఖరారు చేయడంలో పీసీసీ స్థాయిలో కొన్ని ఇబ్బందులున్నాయి. స్క్రీనింగ్ కమిటీ లెవల్‌లో మరికొన్ని చిక్కులున్నాయి. వీటన్నింటినీ లోతుగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోవడంలో ఏఐసీసీకి సైతం కొంత తలనొప్పి ఎదురవుతున్నది. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని, అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ బలంగా నమ్ముతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో 119 స్థానాలకు దాదాపు వెయ్యి మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో సుమారు 40 స్థానాల్లో సీనియర్లు, గెలిచే అవకాశం ఉన్నవారు, పాపులర్ లీడర్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. వీరిని సంతృప్తిపర్చడం కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నేతలకు కత్తిమీద సాములా మారింది. ఏక కాలంలో సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ, విజయావకాశాలు, సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే నివేదిక, సీనియర్ నేతల సిఫారసులు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తున్నది.

ఆశావహుల పేర్లను వడపోత పోసి అభ్యర్థులను ఫైనల్ చేయడానికి ఢిల్లీలోని వార్‌రూమ్‌లో (ఈ నెల 10న సమావేశం జరిగిన రోజు) యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు, ఉస్మానియా జేఏసీ, ఉద్యమకారుల ప్రతినిధులు ఓపెన్‌గానే ఏఐసీసీ నేతల ముందు టికెట్ డిమాండ్లు ఉంచారు. దాని కన్నా ముందే కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐక్య వేదిక ప్రతినిధులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. పది సీట్లు అయినా ఇవ్వాలని రిక్వెస్టు చేశారు. ఇక ఓబీసీ నేతలంతా కలిసి ప్రతి పార్లమెంటు సెగ్మెంట్‌లో రెండు చొప్పున టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎల్లుండి సమావేశంలో ఖరారు చేసే చాన్స్

ఈ నెల 14న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసే చాన్స్ ఉన్నది. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడే వార్ రూమ్ ఎదుట ఆశావహులు ప్లకార్డులతో తమ డిమాండ్లను తెలియజేశారు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ సమయానికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందోననే చర్చలు పార్టీలో జరుగుతున్నాయి.

అసంతృప్తి తలెత్తుతుందేమోననే అనుమానంతో ఉద్దేశపూర్వకంగానే అభ్యర్థుల లిస్టును విడుదల చేయకుండా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసంతృప్త నేతలను బీఆర్ఎస్ ప్రలోభపెట్టి ఆ పార్టీలోకి లాగేసుకుంటుందనే అనుమానమూ లేకపోలేదు. దీనికి తావు ఇవ్వకుండా ఒకవైపు లిస్టు రిలీజ్ ప్రక్రియను ఆలస్యం చేయడంతో పాటు అసంతృప్తులను బుజ్జగించడానికి జానారెడ్డి నేతృత్వంలో మరో ముగ్గురు జాతీయ నేతలతో కలిపి ఫోర్ మెన్ కమిటీని పార్టీ అధిష్టానం ఏర్పాటుచేసింది.

లిస్టును రిలీజ్ చేయకుండా జాప్యం చేయడం ద్వారా కేవలం అసంతృప్తిని నివారించుకోవడం ఒక అంశమైతే ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీ చేసే ప్రయత్నాలకు బ్రేక్ వేయడం మరో ప్లాన్. కర్ణాటకలో అసంతృప్తిని చల్లార్చడానికి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేసి ఇతర పదవులతో వారిని సంతృప్తి పర్చాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. జానారెడ్డితో కూడిన ఫోర్ మెన్ కమిటీ ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన తర్వాత లిస్టును రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. దీనికి తోడు నామినేషన్ ప్రక్రియ ఎలాగూ వచ్చే నెల 3న ప్రారంభం కానున్నందున వివాదం లేని స్థానాలు, అసంతృప్తికి ఆస్కారం లేని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశమున్నది. మిగిలిన స్థానాల అభ్యర్థుల లిస్టును విడతల వారీగా రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నట్టు టాక్.

ఇటు సొంత పార్టీ నేతలకు.. అటు బీఆర్ఎస్‌కు..

అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తున్న వ్యూహం ఇటు సొంత పార్టీ నేతలకు, అటు ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్‌కు సంకటంగా మారింది. టికెట్ రాకపోతే మరో పార్టీలోకి వలస వెళ్లడంపై ‘నిరాశావహులు’ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు స్థానికంగా కేడర్‌ను ఆకర్షించి ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలని బీఆర్ఎస్ కూడా కాచుక్కూర్చున్నది. ఈ రెండు ప్రయత్నాలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ సస్పెన్స్ కొనసాగిస్తున్నది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించినా అసంతృప్తి అనివార్యం కావడంతో ప్రత్యామ్నాయాన్ని సెట్ చేసుకునేంత వరకు లిస్టును హోల్డ్‌లో పెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల చివరి వరకూ ఈ ఉత్కంఠ కంటిన్యూ అయ్యే చాన్స్ ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed