బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ..ప్రయాణ ప్రాంగణం లేక ఇక్కట్లు

by Aamani |
బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ..ప్రయాణ ప్రాంగణం లేక ఇక్కట్లు
X

దిశ,ఇచ్చోడ : మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్నా లేనట్టే.. ఏండ్ల క్రితం కట్టిన బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మొదటగా బస్టాండ్ కి వెళ్లిన ప్రయాణికులు ఇప్పుడు అది దూర భారం కావడంతో అక్కడికి వెళ్లడం లేదు. ప్రస్తుతం బజార్హత్నూర్ చౌరస్తా వద్ద తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ఇక్కడ నుంచి ఆదిలాబాద్, కిన్వాట్, నిర్మల్, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజు వందలాది మంది ఎక్కే ఈ తాత్కాలిక బస్టాండ్ వద్ద ఎలాంటి షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ వర్షానికి తడుస్తూ తీవ్ర అవస్థలు పడుతూ బస్సుల కోసం వేచి ఉంటున్నారు.వచ్చీ పోయే బస్సులు, ఆటోలు, జీపులు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు నిరూపయోగంగా ఉన్న ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఉపయోగంలోకి తేవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

మరుగుదొడ్లు లేక ఇబ్బందులు..

నిత్యం వందలాది మంది ప్రయాణికులతో వివిధ పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో మండల కేంద్రం కిటకిటలాడుతుంది. ప్రధానంగా ఈ బజార్హత్నూర్ చౌరస్తా ప్రాంతంలో మరుగుదొడ్డి సౌకర్యం లేక బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు, బస్సు దిగిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా బజార్హత్నూర్ చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed