సత్వర నిర్ధారణతో బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స..

by Sumithra |
సత్వర నిర్ధారణతో బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : సత్వర నిర్ధారణతో బ్లడ్ క్యాన్సర్ నయం అవుతుందని, దానిపై భయం వీడాలని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైషెట్ వార్ అభిప్రాయపడ్డారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోణార్క్ ఎన్ బీఆర్ ఆసుపత్రిలో హైదరాబాద్ యశోదఆసుపత్రిలో యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాన్సర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడం ముఖ్యమని చెప్పారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా బ్లడ్ క్యాన్సర్ లో స్టేజ్ లు ఉండవని రక్తపరీక్షల ద్వారా వెంటనే నిర్ధారణ జరిగితే ఈ క్యాన్సర్ ను నయం చేయవచ్చన్నారు. ఆరు నెలల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్దుల వరకు అనేక మందిలో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించి నయం చేశారన్నారు.

బ్లడ్ క్యాన్సర్ ను సగం పోలిన ఎముక మజ్జ ట్రాన్స్ ప్లాంట్, బీఎంటీ విధానం ద్వారా విజయవంతంగా నయం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. భారతీయ రోగులకు ఫుల్ మ్యాచ్ పూర్తిగా సరిపోలిన ఎముకమజ్జ కుటుంబంలో ఐదుగురిలో ఒకరికి మాత్రమే ఎముక మజ్జ దాత లభిస్తున్నారని చెప్పారు. 80 శాతం మంది రోగులకు విదేశాల నుంచి ఎముకమజ్జ తెప్పించవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. పెరిగిపోయిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కారణంగా ప్రతిఏటా 2500 మందికి పైగా బోన్ మ్యారో మార్పిడి చేసే పరిస్థితి నెలకొందన్నారు. బ్లడ్ క్యాన్సర్ తో పాటు ఇతర అనేక క్యాన్సర్లను నయం చేయడానికి ఇటీవల అభివృద్ధి చెందిన ఇమ్యునో థెరపీలో కూడా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటును ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు.

బ్లడ్ క్యాన్సర్ నివారణ రేటులో ఇమ్యోనో థెరపీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. తమ ఆసుపత్రిలో ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మల్ జిల్లాకేంద్రంలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పేదరికంతో ఉన్నవారు సైతం బ్లడ్ క్యాన్సర్ నుంచి ముందు జాగ్రత్తలు తీసుకుంటే బయటపడవచ్చు అని చెప్పారు. జ్వరాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దని రక్తనమూనాలు ఎప్పటికప్పుడు పరీక్షలకు ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించే అవకాశం ఉందన్నారు.

నిర్లక్ష్యం వల్ల అనేకమంది బ్లడ్ క్యాన్సర్ తో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు బ్లడ్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిర్మల్ కు చెందిన 8 సంవత్సరాల అక్షర, శ్రీదేవి అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోణార్క్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ప్రశాంత్ షిండే, గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ ప్రతిభారెడ్డి, వైద్యులు సుభాష్ రావు, ఎంవీఎస్ రావ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story