ఫుడ్ ప్రాసెస్సింగ్ భూముల్లో దొంగలు..నిద్ర మత్తులో అధికారులు

by Aamani |
ఫుడ్ ప్రాసెస్సింగ్ భూముల్లో దొంగలు..నిద్ర మత్తులో అధికారులు
X

దిశ,బెల్లంపల్లి : అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వం అక్రమార్కుల కి కాసులు కురిపిస్తుంది. బెల్లంపల్లి పట్టణం ఫుడ్ ప్రాసెసింగ్ భూములు కొందరికి ఉపాధిగా మారింది. కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ ఓనర్లు పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదన్న నిబంధనను కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు ఓనర్లు ఉల్లంఘిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ ఓనర్లు తమ అక్రమ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. లక్షల రూపాయలను ఉత్తిపుణ్యాన వెనుకేసు కుంటున్నారు. ప్రభుత్వ భూముల లక్ష్యంగా మట్టి దందా సాగుతుంది. పలుకుబడి, అధికారుల అండదండలతో మట్టి చోరీకి అడ్డులేకుండా పోతుంది.

బొందల గడ్డగా ఫుడ్ ప్రాసెసింగ్ భూములు..

బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ మిశ్రమ పరిశ్రమ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తరలింపుతో బొందలగడ్డలను తలపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ట్రాక్టర్ ఓనర్లు మట్టి దందా వల్ల ప్రభుత్వ సంపద దుర్వినియోగం అవుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్భయంగా మట్టిని ఎత్తుకెళ్తున్నారు. రాత్రనకా పగలనకా మట్టి చోరీ దందా నిరంతరం సాగుతుంది. ఉచితంగా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తీసుకెళ్తూ సదరు ట్రాక్టర్ ఓనర్లు, కాంట్రాక్టర్లు లక్షల్లో లాభపడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు తామ నిర్వహించే రోడ్డు, భవన నిర్మాణ, ఇతర పనులకు అక్రమంగా ప్రభుత్వ భూముల్లోని మట్టిని తీసుకెళ్తున్నారు. ట్రాక్టర్ మట్టికి కనీసం రూ.2 వేల కు పై రేటు ఉంటుంది. ఖర్చును తగ్గించుకునేందుకు కాంట్రాక్టర్లు మట్టిని స్వాహా చేస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు ఓనర్లు అక్రమంగా మట్టిని తరలిస్తూ వేల రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టి దందా ఇక్కడ సర్వసాధారణమైంది. దీంతో పట్టణం శివారులోని ప్రభుత్వ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ భూములు బొందల గడ్డలుగా దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ మట్టిని కాజేస్తారు. దీంతో శివారులోని మట్టి తవ్వకాల తో నిలువెత్తు గోతులు లేని భూమి కనిపించదoటే అతిశయోక్తి కాదు.

చోద్యం చూస్తున్న అధికారులు..

బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నడుస్తున్న మట్టి తవ్వకాల పై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ భూముల్లో మట్టి కి రక్షణ లేకుండా పోయింది. అక్రమంగా మట్టి తరలిపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అధికారులు ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి అక్రమ దందా పై అధికారుల నిర్లక్ష్యమో, లేదా వారితో కరచాలమా తెలియదు కానీ, బెల్లంపల్లిలో మాత్రం మట్టి దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు యదేచ్ఛగా సాగుతున్న మట్టి దందాను అరికట్టాల్సిన బాధ్యతను ఇక నుంచి అయినా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత తహసీల్దార్ జ్యోత్స లను సెల్ ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed