SP Gaush Alam : జిల్లాలో ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత

by Aamani |
SP Gaush Alam : జిల్లాలో ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటైన రిమ్స్ కళాశాల ఆసుపత్రిలో భద్రత ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. కలకత్తాలో జరిగిన సంఘటన నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీ రిమ్స్ ను సందర్శించి భద్రతాపరంగా తీసుకుంటున్న అంశాలను పర్యవేక్షించారు. ముందుగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధానం,ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్ని సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేయాలని సూచించారు. కళాశాల,వసతి గృహ పరిసర ప్రాంతాలను రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో కలిసి పరిశీలించి లోపాలను సరి చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో కళాశాల,వసతి గృహ ప్రాంతాలలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

అత్యవసరమైన సమయాల్లో వైద్యులకు రక్షణగా ముందుండాలని, పోలీసు సిబ్బంది వచ్చేంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని కాపాడాలని సూచించారు. ప్రైవేట్ సిబ్బందికి పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అత్యవసరమైన సమయంలో స్పందించే విధానాలను తెలియజేస్తాం అన్నారు. రిమ్స్ కళాశాలలో పోలీస్ అవుట్ పోస్ట్ లో 24 గంటలు పనిచేసే ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతామన్నారు. రెండు షిఫ్ట్ లలో అదనంగా ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ అంశాలను తెలియజేస్తూ ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరగాళ్లు అవలంబిస్తున్న విధానాలను విద్యార్థులకు వివరించారు. సమాజంలో సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న ఓటీపీ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, పోలీస్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ లాంటి అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. అవసరమైనటువంటి, సెక్యూరిటీ లేనటువంటి అప్లికేషన్లను మొబైల్ ఫోన్లో వినియోగించుకోకుండా చూడాలన్నారు.

సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు,అదేవిధంగా సైబర్ క్రైమ్ వెబ్సైట్లను విద్యార్థులకు తెలియజేసి అత్యవసర సమయంలో స్పందించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, హసీబుల్లా, బి సురేందర్ రెడ్డి, మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, వైద్యులు, సెక్యూరిటీలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed