Police Commissioner Srinivas : అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

by Sumithra |
Police Commissioner Srinivas : అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి..
X

దిశ‌, మంచిర్యాల : భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయ‌ని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అర్జున్ గుట్ట వద్ద ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహిత వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత వరదల వల్ల ప‌రివాహ‌క ప్రాంతాల్లో గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి..? ఎలాంటి సహాయక‌ చర్యలు చేప‌ట్టాల‌నే విష‌యంలో ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డీడీఆర్ఎఫ్ పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంలో లెవెల్ బ్రిడ్జ్ లు మునిగి రహదారుల పై నుంచి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు.



Next Story