కాగజ్ నగర్ కారిడార్‌లో పులి సంచారం.. వ‌ణికిపోతున్న జ‌నం

by srinivas |   ( Updated:2024-08-07 03:18:16.0  )
కాగజ్ నగర్ కారిడార్‌లో పులి సంచారం.. వ‌ణికిపోతున్న జ‌నం
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: కాగజ్ నగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగింది. సరిహద్దు మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం. ఆవాసం కోసం బెబ్బులి సరిహద్దు దాటి జిల్లాలోని అడవుల్లోకి వస్తున్నాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పులి దాడులు పెరగడం.. మనుషులపై దాడులు చేసి ప్రాణాలు తీయడంతో భయాందోళన మధ్యే జ‌నం జీవనం సాగిస్తున్నారు. తాజాగా ఓ పులి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే సంచరించడంతో ఎటు వైపు నుండి పులి దాడి చేస్తుందోనని ప‌లువురు భ‌యాందోళన‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీట‌ర్ల‌ దూరంలో పులి సంచరిస్తుండటం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గోవింద్ పూర్, గుండి, కెస్లాపూర్ గ్రామాలలోని పంట చేన్లలో పెద్దపులి సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పంటపొలాలలో పని చేస్తుండగా గాండ్రిపులు వినిపించడం.. భయాందోళనకు గురైన రైతులు పంటపొలాలను పరిశీలించారు. సమీప పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్వో గోవింద్ చంద్ సర్దార్, డీఆర్వో యోగేష్, ఎఫ్ఎస్‌వో విజయ్, ఎఫ్‌బీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పాద ముద్రలను గుర్తించి పెద్దపులివిగా నిర్ధారించారు. 13 నుండి 14 మీటర్ల పొడవున్న పులి పాదముద్రలుగా గుర్తించి 3 ఏళ్ల వయసున్న పులిగా అంచనా వేశారు. గోవింద్ పూర్ శివారు ప్రాంతం మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వెనుక నుంచి పెద్ద వాగు దాటి కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ వైపు వెళ్లి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

తిర్యాణి మండ‌లంలో ప్ర‌త్య‌క్షం..

సోమ‌వారం కొమురంభీమ్ జిల్లా కేంద్రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో త‌చ్చాడిన పులి తాజాగా మంగ‌ళ‌వారం తిర్యాని మండలం ఎదుల పహాడ్ గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో ఎద్దు పై దాడి చేసి చంపింది. కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లంలోని అంకూసాపూర్ శివారులో కూడా ఓ ప‌శువుపై దాడి చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో ఆ పులి ఇప్ప‌టికే రెండు ప‌శువుల‌పై దాడిచేసింది. తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వలస వచ్చిన పులిగా భావిస్తున్న అధికారులు.. తిర్యాని మండ‌లం వైపు వెళ్లిన‌ట్లు నిర్దారించారు. ప్రస్తుతం పంటల సమయం కావడంతో పులి సంచారంతో రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బూరుగూడ, ఈదులవాడ, రాజూర, గుండి, గోవింద్పూర్ గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. గతంలో కాగజ్ నగర్ మండలంలో అటవీ ప్రాంతంలో రెండు పులులను విష పెట్టి చంపిన ఘటన నేపథ్యంలో వలస వచ్చిన పులి‌కి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.

డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్.

పెద్ద పులి తిరుగుతున్న పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా చేలలోకి ఎవరు వెళ్ళకూడదని, బ‌య‌ట తిరగకూడదని, నలుగురు ఐదుగురు గుమిగూడి ఉండాలని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. ఆయ‌న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని డీఎఫ్ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులి సోమ‌వారం ఆసిఫాబాద్ మండలం గుండి, గోవింద్ పూర్ గ్రామ సమీపంలోని పత్తి చేనులోకి వచ్చిందన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు వెళ్లారని చెప్పారు. పెద్దపులి అడుగులని నిర్ధారించాక పులి కోసం సాయంకాలం వరకు గాలించామ‌న్నారు. అక్కడి నుంచి పెద్ద వాగు నుచి తిర్యాని మండలం ఎదుల వాడలో ఒక ఆవుని చంపిన‌ట్లు చెప్పారు. వారికి నష్టపరిహారంగా 5వేల రూపాయలు ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఇచ్చారన్నారు. పులి జాడ కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ బెబ్బులి మహారాష్ట్ర నుంచి ఒక నెల కింద‌ట‌ వచ్చిన పులిగా గుర్తించామన్నారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్ లో పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డిఎఫ్ఓ నిరజ్ కుమార్ టిబ్రే వాల్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed