కేసీఆర్ కు మరాఠాల షాక్..! మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు తొలి దెబ్బ

by Shiva |
కేసీఆర్ కు మరాఠాల షాక్..! మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు తొలి దెబ్బ
X

బోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం

దిశ ప్రతినిధి: నిర్మల్ దేశంలో పాగావేస్తామంటూ తొలి అడుగుగా మహారాష్ట్ర కు వెళ్లిన సీఎం కేసీఆర్ కు మరాఠాలు గట్టి షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మారి జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు ఆ పార్టీకి ఘోర పరాజయాన్ని మిగిల్చారు. మొత్తం 18 మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా సాగిన పోటీలో ఒక్కటంటే ఒక్కటి సీటు దక్కకుండా మరాఠా రైతులు తీర్పు చెప్పారు. కచ్చితంగా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనుకొని ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గంలోనే ఫలితాలు అధికార పార్టీని నిరాశపరిచాయి.

రాష్ట్ర సరిహద్దున తొలి షాక్..

తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని నిర్మల్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని బోకర్ తాలూకా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఒక్క డైరెక్టర్ పదవిని కూడా దక్కించుకోలేకపోయారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలో నిలిపాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది.

18 మంది డైరెక్టర్ల పోస్టులకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 15 మంది, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు తమను గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా రైతులకు ఉచిత కరెంటు తో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తామని విపరీతంగా ప్రచారం చేశారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటి చేస్తుందని సీఎం కేసీఆర్ మొన్నటి ఔరంగాబాద్ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి పార్టీని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాందేడ్ తో పాటు ఔరంగాబాద్, తదితర చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభలు నిర్వహించినప్పటికీ బోకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఓటమి పాలవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన అధికార రాష్ట్ర సమితి పార్టీకి సీఎం కేసీఆర్ కు ఈ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి కాగా బోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌవాన్ తన నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో తన బలాన్ని చాటుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed