Deputations : నిబంధనలకు విరుద్ధం.. క్రీడాపాఠ‌శాల‌లో గంద‌ర‌గోళంగా డిప్యూటేష‌న్‌లు

by Aamani |
Deputations : నిబంధనలకు విరుద్ధం.. క్రీడాపాఠ‌శాల‌లో గంద‌ర‌గోళంగా డిప్యూటేష‌న్‌లు
X

దిశ‌,ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలను విద్యాశాఖ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. జిల్లాలోని క్రీడా పాఠ‌శాలకు సంబంధించిన‌ ఉపాధ్యాయుల డిప్యూటేష‌న్ల విష‌యం రాద్దాంతంగా మారుతోంది. ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌కు విరుద్ధంగా బ‌దిలీలు చేప‌ట్ట‌డం వివాదంగా మారింది. దీంతో క‌లెక్ట‌ర్ ఇచ్చిన వారి పోస్టింగ్ ర‌ద్దు చేసి తిరిగి నిబంధ‌న‌ల ప్ర‌కారం భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించినా, వాటిని బేఖాత‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నియ‌మించిన ఉపాధ్యాయుల‌నే ఇంకా కొన‌సాగించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడాపాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల డిప్యూటేష‌న్ల వ్య‌వ‌హారం చిలికిచిలికి గాలివాన‌లా మారుతోంది. ఈ పాఠ‌శాల‌లో ప‌నిచేసేందుకు ఉన్న‌త‌పాఠ‌శాల‌ల్లో అద‌నంగా ఉన్న ఉపాధ్యాయులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ మేర‌కు 02-07-2024న 10 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీ కోసం ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. 05-07-2024 వ‌ర‌కు ఈ ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, సోష‌ల్‌, మాథ్స్‌, ఫిజిక‌ల్ సైన్స్‌, బ‌యాల‌జిక‌ల్ సైన్స్ స‌బ్జెక్ట‌ల వారీగా ఒక్కొక్క‌రు కాగా, ఎస్‌జీటీ ఇద్ద‌రు, పీఈటీ-పీడీ పోస్టుల‌కు ఒక్కొక్క‌రు చొప్పున కావాల‌ని నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎంపిక‌..

అయితే, ఈ వ్య‌వ‌హారంలో ఎక్క‌డా కూడా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. ఇందులో ఇంగ్లీషు, ఫిజిక‌ల్ సైన్స్‌కు ఇద్ద‌రి చొప్పున ఎంపిక చేశారు. మిగ‌తా స‌బ్జెక్టుల‌కు ఒక్కొక్క‌రి చొప్పున డిప్యూటేష‌న్ పేరిట ఉత్త‌ర్వులు అందించారు. అయితే, నోటిఫికేష‌న్‌లో ఒక్కో స‌బ్జెకుకు ఒక‌రి చొప్పున నోటిఫికేష‌న్ ఇచ్చి, ఇంగ్లీషు, ఫిజిక‌ల్ సైన్స్‌కు ఇద్ద‌రి చొప్పున ఎంపిక చేయ‌డం వివాద‌స్పందంగా మారింది. ఒత్తిళ్ల మ‌ధ్య ఓ ఉపాధ్యాయుడికి అర్హ‌త లేకున్నా స్పోర్ట్స్ పాఠ‌శాల‌కు డిప్యూటేష‌న్ ఇచ్చారు. మ‌రో ఉపాధ్యాయుడికి సంబంధించి సైతం వివాదం కొన‌సాగుతోంది. ఉన్న‌త‌పాఠ‌శాల‌ల్లో అద‌నంగా ఉన్న ఉపాధ్యాయులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నిబంధ‌న‌ల్లో స్ప‌ష్టంగా ఉంది. కానీ ఓ ఉపాధ్యాయుడు మాత్రం త‌మ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులు స‌ర్‌ప్ల‌స్ లేకున్నా పోస్టింగ్ ఇవ్వ‌డంతో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

స్వ‌యంగా రంగంలోకి క‌లెక్ట‌ర్ రాజ‌ర్షిషా..

అయితే, ఇవ‌న్నీ క‌లెక్ట‌ర్ దృష్టికి రావ‌డంతో అర్హ‌త లేకుండా, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇచ్చిన డిప్యూటేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని క‌లెక్ట‌ర్ రాజ‌ర్షిషా డీఈవోను ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్‌లో ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేయ‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఈవోకు చెప్పారు. దాదాపు వారం గడిచిపోయినా డిప్యూటేష‌న్లు కొన‌సాగుతుండ‌టంతో ఆయ‌నే నేరుగా రంగంలోకి దిగారు. పాత వారిని అలాగే కొన‌సాగించ‌డం, కొత్త‌గా డిప్యూటేష‌న్ కోసం నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం ఇలాంటివి ఏవీ కూడా డీఈవో చేయ‌క‌పోవ‌డంతో క‌లెక్ట‌ర్ నేరుగా ఎంఈవోల స‌మావేశం ఏర్పాటు చేశారు. వారి ప‌రిధిలో ఉన్న పాఠ‌శాల‌లు, అద‌నంగా ఉన్న ఉపాధ్యాయుల జాబితా తీసుకున్నారు. డీఈవో కార్యాల‌యంలో ఉన్న పోస్టింగ్‌లు, బ‌దిలీల‌కు సంబంధించిన జాబితా సైతం తెప్పించుకున్న క‌లెక్ట‌ర్ 1:4 రేషియో ప్ర‌కారం కౌన్సెలింగ్‌కు పిలిచారు. సినియారిటీ, స‌బ్జెక్టుల వారీగా జాబితా విడుద‌ల చేశారు.

డీఈవో వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హం..

ఆదిలాబాద్ డీఈవో వ్య‌వ‌హార‌శైలిపై ప‌లువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి డిప్యూటేష‌న్లు చేయ‌డం ఏమిట‌ని వారు దుయ్య‌బ‌డుతున్నారు. ఒక నోటిఫికేష‌న్ ఇచ్చి, ఆ నోటిఫికేష‌న్ కు విరుద్ధంగా డిప్యూటేష‌న్లు చేయ‌డం ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ రంగంలోకి దిగి ఈ విష‌యంలో క‌లుగ‌చేసుకునేంత వ‌ర‌కు కూడా డీఈవో ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై డీఈవోతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా, ఆమె అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story