అనుమతులు నిల్... అమ్మకాలు ఫుల్..

by Sumithra |
అనుమతులు నిల్... అమ్మకాలు ఫుల్..
X

దిశ, ఇచ్చోడ : దుబార్ పేట గ్రామం నాలుగేళ్ళ క్రితం ఇచ్చోడ జీపీ పరిధిలో అనుబంధ ఏజెన్సీ గ్రామంగా ఉండేది. 500 జనాభా కలిగి ఉన్న ఈ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీపీగా ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి 44కు సమీపంలోనే ఉండటంతో సాగు భూములకు భలే డిమాండ్ ఉండడంతో ఏజెన్సీ గ్రామంలో ప్రస్తుతం అక్రమ వెంచర్లు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ ప్లాట్లుగా మారుస్తూ రియల్టర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏజెన్సీ చట్టాలను పాటించకుండానే తుంగలోకి తొక్కుతున్నారు.

అనుమతులు లేకుండానే...

నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ లాండ్స్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌) చట్టం-2006 ప్రకారం కన్వర్షన్‌ చేయకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచు కోవడం లేదు. నాలా చట్టాన్ని అనుసరించి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తే ఏక మొత్తంలో ఒకేసారి కన్వర్షన్‌ చార్జీలను భూమి విలువపై 3 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కన్వర్షన్‌ అనంతరం భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలంటే డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి తప్పనిసరి. ఎకరం (40 గుంటలు) స్థలంలో డీటీసీపీ అనుమతికి వెళ్తే 12 శాతం ఓపెన్‌ స్థలం (9 శాతం గ్రీనరీ, 1 శాతం వాటర్‌ ట్యాంక్‌, సెప్టిక్‌ ట్యాంకులు, 1 శాతం వాణిజ్య అవసరాలు, 1 శాతం హెల్త్‌ సెంటర్‌, పాఠశాల) కోసం స్థలం కేటాయించాల్సి ఉంటుంది.

నిర్ధేశించిన వెడల్పుతో రోడ్లకు స్థలం పోగా ఎకరానికి 24 గుంటలు మాత్రమే ప్లాట్ల స్థలం మిగులుతుంది. అంతర్గత రోడ్లు 30 ఫీట్ల వెడల్పు, మెయిన్‌ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు కనీసం 40 ఫీట్ల వెడల్పుతో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. డీటీసీపీ అనుమతి కోసం బెటర్మెంట్‌, డెవలప్‌ మెంట్‌ చార్జీల పేరిట భూమి విలువకు అనుగుణంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించాలి. రెండున్నర ఎకరాల వరకు జిల్లా టౌన్‌ ఆండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆఫీసర్‌, 5 ఎకరాల్లోపు ఆర్‌జేడీ వరంగల్‌, 5 ఎకరాలకు పైన డీటీసీపీ హైదరాబాద్‌లో లే అవుట్‌ అనుమతి పొందాల్సి ఉంటుంటి. నాలాలు, వాగులు, చెరువులు ఉన్నసమీపంలో నీటి పారుదల శాఖ ఎన్‌వోసీ, హైటె న్షన్‌ విద్యుత్‌ లైన్లు, టవర్‌ల సమీపంలో విద్యుత్‌ శాఖ ఎన్‌వోసీ, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న లేఔట్‌లకు సంబంధించి నేషనల్‌ హైవే అథారిటీ ఎన్‌వోసీ జతచేయాల్సి ఉంటుంది. లేఔట్‌ స్థల పరిమాణాన్ని బట్టి మండల సర్వేయర్‌, డిప్యూటీ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సర్వే సెటిల్‌మెంట్‌, లాండ్‌ రికార్డ్స్‌) సబ్‌ డివిజన్‌ చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అనుమతి జతచేయాల్సి ఉంటుంది.

వసతులు ఉస్ కాకీ...

డీటీసీపీ లే అవుట్‌ వెంచర్‌లలో అన్ని రకాల వసతులైన 33 ఫీట్ల రోడ్డు, బీటీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ప్రహారీ, వాటర్‌ పైప్‌లైన్‌, సంప్‌, ఎలక్ర్టిసిటీ, వీధి లైట్లు, ఓపెన్‌ జిమ్‌, వాలీబాల్‌, షటీల్‌ కోర్టులు, పార్కు, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, రోడ్డుకు ఇరువైపుల చెట్లు, స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ వంటి సౌకర్యాలు వెంచర్లలో కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు వెంచర్‌లలో ఉంటేనే ప్లాట్లు విక్రయించాలి. ప్రస్తుతం దుబార్ పేట గ్రామంలో వెలిసిన ఈ వెంచర్‌లో ఎక్కడా పై నిబంధనలు అమలు కావడం లేదు. అంత మోసం.. దగా..ప్లాట్లను ఏర్పాటు చేసి అమాయకులకు అంట గడుతూ రియల్టర్లు చేతులు దులుపు కుంటున్నారు.

ఎలాంటి అనుమతులు లేవు..

కిరణ్ పంచాయతీ కార్యదర్శి దుబార్ పేట జీపీ దుబార్ పేట ఏజెన్సీ గ్రామంలో వెలసిన వెంచర్లకు జీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తులు చేసు కోలేదన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలో బండ రాళ్లను తొలగించామని తెలిపారు. ఇందులో ఎవరు కూడా ప్లాట్లను కొనుగోలు చేయకూడ దంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రియల్టర్ల పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story