Bellampalli : ఇవి ప్రాక్టికల్స్ కాదు.. నిజంగానే విద్యార్థులు రొట్టెలు చేస్తున్నారు..

by Aamani |
Bellampalli : ఇవి ప్రాక్టికల్స్ కాదు.. నిజంగానే విద్యార్థులు రొట్టెలు చేస్తున్నారు..
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఓ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల చేత రొట్టెలు చేపించిన వైనం వెలుగు చూడటం సంచలనంగా మారింది. అక్షరాలు దిద్దించే పాఠశాలల్లో విద్యార్థుల చేత రొట్టెలు చేపించడం ఏంటి అన్న ప్రశ్న కలకలం రేపుతోంది. ఈ సంఘటన బెల్లంపల్లి లోని కాసిపేట ప్రభుత్వ గురుకుల బాలుర పాఠశాలలో తలెత్తడంతో ఒక్కసారిగా దుమారం లేసినట్టు అయింది. అటు విద్యార్థి సంఘాల్లో, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పక్కన కాసిపేట ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల కలదు. ఈ పాఠశాలలో ఇవాళ విద్యార్థులతో రొట్టెలు చేపిస్తున్న విషయం బయటకు పొక్కింది. సమాచారమే కాదు.. సాక్షాత్తు విద్యార్థులు వంట రూమ్ లో రొట్టెలు చేస్తున్న వీడియో దృశ్యాలు వైరల్ తో ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తించింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించారు.

వంట పనులు చేపించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సహజంగా పాఠశాలల్లో తప్పులు చేసిన విద్యార్థుల తో పనిష్మెంట్ రూపంలో గడ్డి పీకించడo, దండించడం లాంటి పనులు చేపించడాన్నే తప్పు పడతారు. కానీ విద్యార్థుల తో ఏకంగా అల్పాహారం కోసం రొట్టెలు చేపించడం సహించరాని విషయంగానే పరిగణించాలి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు అక్షరాలకు బదులు విద్యార్థులతో రొట్టెలు, వంట పనులు, అందుకు పనికివచ్చే పనులను చేపించడం ఇక్కడ విద్యార్థులకు సాధారణమైన విషయంగా తెలుస్తోంది. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో రొట్టెలు చేపిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఉపాధ్యాయుల నిర్వాకం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. విద్యాధికారుల దృష్టికి కూడా పోకుండా ఉండదు. అయితే ఈ సంఘటన గురుకుల పాఠశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్ సంతోష్ ఉన్న సమయంలో జరగలేదని సెలవిస్తున్నారు.

రెండు రోజులుగా ఆయన లీవ్ లో ఉండగా ఇంచార్జి ప్రిన్సిపాల్ టైం లో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఏదేమైనా విషయం ఎవరి హయాంలో జరిగిందనేది ముఖ్యం కాదు. పాఠశాలల్లో విద్య బోధనకు సంబంధం లేకుండా విద్యార్థుల తోటి రొట్టెలు చేపించడం అనేది తీవ్రమైన తప్పిదం. ఈ ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల తో వంట పనులు, ఇతర పనులు వంతుల వారీగా చేస్తున్నారన్న ఆరోపణలు ఈ సందర్భంలో వ్యక్తమవుతున్నాయి. రొట్టెలు చేపించిన వైనం ఇప్పటికిప్పుడే జరిగింది కాదు. విద్యార్థులు ఆ పాఠశాలలో ఇలాంటి పనులు చేయడం కామన్ విషయంగానే అందులో భాగంగానే విద్యార్థులు రొట్టెలు చేస్తున్నారని సమాచారం.విద్యార్థుల రొట్టెలు చేపిస్తున్న సంఘటన పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed