పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

by Sridhar Babu |
పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
X

దిశ, ఆసిఫాబాద్ : పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కాటన్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెటింగ్ తదితరులతో పాటు జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3 లక్షల 30 వేల ఎకరాలలో రైతులు పత్తి సాగు చేస్తున్నారని, 23 లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో 17 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాల్ కు 7 వేల 521 రూపాయలుగా నిర్ణయించిందని తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్, తూనికలు కొలతల శాఖల అధికారులు జిన్నింగ్ మిల్లులను సందర్శించి సౌకర్యాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లు యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. మిల్లుల్లో పత్తి నిల్వ పేరుకుపోకుండా చూడాలని, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో పత్తి మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేర పత్తి కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Next Story