Delhi : ఢిల్లీ సీఎం నివాసానికి తాళం.. ఆప్ ప్రభుత్వం వర్సెస్ పీడబ్ల్యూడీ విభాగం

by Hajipasha |
Delhi : ఢిల్లీ సీఎం నివాసానికి తాళం.. ఆప్ ప్రభుత్వం వర్సెస్ పీడబ్ల్యూడీ విభాగం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం నివాసంపై ఆప్ ప్రభుత్వం, కేంద్ర సర్కారు మధ్య వివాదం రాచుకుంది. ఈనెల 7న (సోమవారం) సీఎం అధికారిక నివాసంలోకి నూతన ముఖ్యమంత్రి అతిషి మకాం మార్చారు. అయితే రెండు రోజుల్లోనే (బుధవారం) సీఎం అధికారిక నివాసాన్ని ఆమె ఖాళీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) సీఎం నివాసానికి తాళాలు వేసింది. ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి తమకు సరైన పత్రాలు సమర్పించకుండా వాడుకుంటున్నందునే సీఎం ఆఫీసుకు తాళాలు వేయాల్సి వచ్చిందని పీడబ్ల్యూడీ విభాగం స్పష్టం చేసింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన చాలా లగేజీ ఇంకా సీఎం ఆఫీసులోనే ఉందని వెల్లడించింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సీఎం నివాసం తాళాలను తమకు అప్పగించకుండా నేరుగా అతిషికి కేజ్రీవాల్ ఇవ్వడాన్ని పీడబ్ల్యూడీ విభాగం తప్పుపట్టింది.

ఢిల్లీ సీఎం నివాసం దురాక్రమణకు..

ఈ వాదనను కౌంటర్ చేస్తూ ఢిల్లీ సీఎం కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం ఆఫీసు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి లగేజీని వాహనాలలో తరలిస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ సూచనలకు అనుగుణంగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే పీడబ్ల్యూడీ విభాగం రంగంలోకి దిగి బల ప్రయోగంతో సీఎం నివాసాన్ని ఖాళీ చేయించింది’’ అని ఢిల్లీ సీఎం కార్యాలయం ఆరోపించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. ఢిల్లీ సీఎం నివాసం దురాక్రమణకు బీజేపీ యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేశారు అనేందుకు ఆధారాలున్నా.. అబద్ధపు ప్రచారంతో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆప్ మండిపడింది. పీడబ్ల్యూడీ విభాగానికి తగిన పత్రాలను ఆప్ ప్రభుత్వం సమర్పించి ఉంటే ఈ సమస్యే తలెత్తేది కాదని ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేత (బీజేపీ) విజేందర్ గుప్తా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed