తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి కొండా సురేఖ

by Mahesh |   ( Updated:2024-10-09 15:00:54.0  )
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీరోచిత పోరాటంతో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా వాయువులు అందించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వంగా తెలంగాణను మహోజ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అన్నారు. రంగుల రంగుల పూలతో ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానమున్నదన్నారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి మొదలు యావత్ తెలంగాణ పూల వనాన్ని తలపించేలా బతుకమ్మలతో కొత్త కళను సంతరించుకున్నదన్నారు. భూమాతతో, జల సంపదతో మానవ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక సంబురంగా వేడుకలను జరుపుకోవడమే ‘బతుకమ్మ’ పరమార్థమన్నారు.

Advertisement

Next Story