- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో ‘హరిత’ విధ్వంసం.. అటవీ ధ్వంసంలో దేశంలోనే తెలంగాణ నెం.1
రాష్ట్రంలో హరితహారం పేరిట సర్కారు ప్రతి ఏటా భారీ హంగామా చేస్తున్నది. ఎనిమిదేళ్లుగా ప్రతి ఏటా ఓ యజ్ఞంలా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కోట్ల మొక్కలు నాటామని ప్రకటిస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం హరితహారంలో నాటిన మొక్కల సంఖ్య 219 కోట్లు. అందులో 85% మొక్కలు బతికే ఉన్నాయని సీఎం కేసీఆర్, మంత్రులు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. మరి అదే నిజమైతే రాష్ట్రం మొత్తం అమేజాన్ ఫారెస్ట్‌లా అయిపోవాలి. రాష్ట్ర విస్తీర్ణం.. అందులో జనవాసాలు, మౌలికవసతులు, జల వనరులు ఇతరత్రాలు తీసివేస్తే.. మనిషి అడుగువేసే సందు కూడా ఉండకూడదు.
మరి ప్రభుత్వ లెక్కలు వాస్తవదూరమా? లేక నిజంగానే రాష్ట్రం మొత్తం హరితవనంలా మారిందా? ఈ విషయంపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి. హరితహారం ఖర్చు విషయంలోనూ సర్కారు ఏమాత్రం వెనుకంజ వేయడంలేదు. 2015 జూలై నుంచి 2022 సెప్టెంబర్ వరకు అక్షరాలా రూ.9,777కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
మరోవైపు అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రం ఏర్పడకముందుతో పోల్చితే అటవీ విస్తీర్ణం అక్షరాలా 378 చదరపు కిలోమీటర్లు తగ్గింది. ప్రాజెక్టులు ఇతరత్రాల కోసం ప్రభుత్వమే 11వేల హెక్టార్ల అడవిని నరికివేయగా.. దానికి ప్రతిగా కేవలం 4951 హెక్టార్లలోనే మొక్కలు నాటింది. మొత్తంగా హరితహారంపై సర్కారు చిత్తశుద్ధికి ఈ గణాంకాలే నిదర్శనం.
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే అత్యధికంగా మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణ అంటూ ప్రభుత్వం చెప్పుకునే గొప్పలు ఎలా ఉన్నా చెట్ల నరికివేతలో మాత్రం తనదైన రికార్డు సృష్టించింది. ఐదేండ్ల వ్యవధిలోనే 16.51 లక్షల చెట్లను నరికేసింది. సుమారు 11,707 హెక్టార్ల అటవీ భూమి ఇతర అవసరాలకు డైవర్ట్ అయింది. ఇందులో దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నరికిందే ఎక్కువ.
హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అదే సమయంలో అడవుల విధ్వంసానికీ పాల్పడింది. హరితహారం పేరుతో 2015-22 మధ్య కాలంలో రూ. 9,777 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో 219 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్తున్నది. గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల నుంచి నిధులను వినియోగించింది. కానీ నాటిన మొక్కల్లో బతికినవెన్నో ఇప్పటికీ లెక్కల్లేవ్. ఆ దిశగా ఎన్యూమరేషన్ ప్రాసెస్‌ను చేపట్టలేదు.
ఫారెస్టు సర్వే రిపోర్టు ప్రకారం తెలంగాణ మొత్తం విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అనగా 13,398 కోట్ల చదరపు గజాలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఎనిమిదేండ్లలో నాటిన మొక్కలు 219 కోట్లు. అంటే ప్రతి 61 చదరపు గజాలకు(అర గుంటకు) ఒక చెట్టు ఉండాలి. పట్టణాలు, గ్రామాలు, పొలాలు, చెరువులు, రిజర్వాయర్లు, పరిశ్రమలు, రోడ్లు, రైలుపట్టాలు.. ఇలాంటివాటితో నిమిత్తం లేకుండా రాష్ట్రమంతా చెట్లతో నిండిపోయి ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కనబడదు.
మొక్కలు.. ఎక్కడ?
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఎనిమిదేండ్లలో 219 కోట్ల మొక్కలు నాటితే 61 చదరపు గజాలకు ఒకటి చొప్పున ఉండాలి. ఫారెస్టు సర్వే రిపోర్టు ప్రకారం రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1,12,077 చదరపు కి.మీ. ఒక్కో చదరపు కి.మీ.కు 247 ఎకరాల చొప్పున మొత్తం విస్తీర్ణం 13,398 కోట్ల చదరపు గజాలు అవుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని నాటిన మొక్కలను లెక్కిస్తే రాష్ట్రంలో ఎటుచూసినా మొక్కలే కనబడాలి.
పట్టణాలు, గ్రామాలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్లు, బిల్డింగులు, ఆఫీసులు, అపార్టుమెంట్లు, స్కై స్క్రాపర్లు, ఇండ్లు, రైలుపట్టాలు.. ఇలాంటివాటన్నింటినీ మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా చెట్లతో నిండిపోయి కనబడాలి. కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కనబడదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో నాటిన మొక్కలెక్కడ? అనే ప్రశ్న తలెత్తుతున్నది.
తగ్గిన అటవీ విస్తీర్ణం
రాష్ట్రం ఏర్పడేనాటికి మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 21,591 చ.కి.మీ. (19.26%) ఉంటే 2021 నాటికి అది 21,213 చ.కి.మీ. (18.93%)కి తగ్గింది. ఏడేండ్లలో అటవీ విస్తీర్ణం పెరగకపోగా తగ్గిపోయింది. ఫారెస్టు సర్వే సంస్థ 2019 రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 2015 జనవరి 1 నుంచి 2019 ఫిబ్రవరి 5 వరకు 9,420 హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించినట్లు తేలింది.
2021 సర్వే రిపోర్టు ప్రకారం మొత్తం విస్తీర్ణంలో 21,213 చ.కి.మీ. మాత్రమే అడవులు కాగా మిగిలినదంతా అటవీయేతర భూమే. 2013 సర్వే రిపోర్టుతో పోలిస్తే 2015 నాటికే (రెండేండ్లలో) 168 చ.కి.మీ. మేర అడవి తగ్గిపోయింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 33%కి పెంచాలనే లక్ష్యం సంగతి ఎలా ఉన్నా ఉనికిలో ఉన్న ఫారెస్టే కనుమరుగై పోతున్నది.
ప్రాజెక్టుల కోసం మాయం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, పంప్ హౌజ్‌లు, మిషన్ భగీరథ పైప్‌లైన్ తదితర అవసరాలకు వేలాది హెక్టార్ల అటవీ భూమి డైవర్ట్ అయింది. రాష్ట్ర ఫారెస్టు డిపార్టుమెంటు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం 2018 డిసెంబరు నాటికే 11,707 హెక్టార్ల అటవీ భూమి ధ్వంసమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా (కాంపెన్సేషన్) అడవుల్ని పెంచుతామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు హామీ ఇచ్చినా అది 4,951 హెక్టార్లకే పరిమితమైంది.
ధ్వంసమైన అడవికి సమాన స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం సాకారం కాలేదు. ‘కాంపా’ నిధులను సుమారు రూ. 5,220 కోట్లను ఖర్చు చేసినా టార్గెట్ పూర్తిచేయలేక పోయింది. కానీ అర్బన్ ఫారెస్ట్రీ, ఎవెన్యూ ప్లాంటేషన్ లాంటి పేర్లతో హెచ్ఎండీఏ, అటవీ శాఖలు మొక్కలు పంపిణీ చేస్తూ హంగామా చేస్తున్నాయి.
చెట్ల నరికివేతలో తెలంగాణ ఫస్ట్
ఏపుగా పెరిగిన చెట్లు, వృక్షాల నరికివేతలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. దేశం మొత్తం మీద 2015-2020 మధ్య ఐదేళ్ల కాలంలో 1.07 కోట్ల చెట్లు నరికివేతకు గురైతే తెలంగాణ అత్యధికంగా 16.51 లక్షలతో మొదటి స్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రంలోనూ ఇంతటి భారీ స్థాయిలో చెట్ల నరికివేత చోటుచేసుకోలేదు.
దేశంలో ధ్వంసమైన చెట్ల సంఖ్యతో పోలిస్తే 15.34% ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నమోదైంది. గరిష్టంగా 2016-17 నుంచి 2018-19 మధ్యకాలంలో 12.12 లక్షల చెట్లను నరికినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మూడేళ్ల వ్యవధిలో దేశం మొత్తం మీద 76.72 లక్షల చెట్లను నరికివేతకు ఆ మంత్రిత్వశాఖ అనుమతులు ఇస్తే అందులో 15.80% తెలంగాణలోనే ఉన్నాయి.
నాడు వన మహోత్సవం.. నేడు హరితహారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం అమలయ్యేది. నైరుతి రుతుపవనాల సమయంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగానే జరిగేది. 1950లో వన మహోత్సవ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాటి కేంద్ర ఆహార శాఖ మంత్రి కేఎం మున్షీ రాజ్‌ఘాట్‌లో ప్రారంభించారు.
ఆ తర్వాత ప్రతి జూలై మొదటివారంలో దేశమంతటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ఇది కొనసాగింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒకే రోజున పది లక్షల మొక్కలు నాటే ‘మిలియన్ ప్లాంట్స్’ కార్యక్రమాన్ని 2010 జూలై 16న నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ‘హరితహారం’ పేరుపెట్టారు.
బతికిన మొక్కలకు లెక్కల్లేవ్!
రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది విడతల (2015-22) హరితహారం కార్యక్రమంలో 283 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 219.13 కోట్లు సాధ్యమైనట్లు రాష్ట్ర అటవీశాఖ పేర్కొన్నది. కానీ ఇందులో బతికినవెన్నో ఇప్పటికీ లెక్కల్లేవ్. ఫారెస్టు శాఖ దగ్గర కూడా ఈ సమాచారం లేదు. బతికిన మొక్కల లెక్కలను సేకరించే ప్రక్రియ చేపట్టలేదని పేర్కొన్నది. ఇందులో 85% మొక్కలు బతికినట్లు అప్పుడప్పుడూ ముఖ్యమంత్రి, మంత్రులు వేదికల మీద చెప్తున్నారు. కానీ అఫీషియల్‌గా ఫారెస్టు డిపార్టుమెంటే ఈ అధ్యయనంపై దృష్టి పెట్టలేదు.
నాటిన మొక్కల్లో సగం బతికినా మన చుట్టూ మినీ ఫారెస్టు తరహా వాతావరణం కనిపించేది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అడవుల్లోనూ మొక్కలు నాటడం మొదలైంది. 2015-19 మధ్యకాలంలో ఐదు విడతల్లో మొత్తం 176.83 కోట్ల మొక్కలు నాటితే అందులో 43.06 కోట్లను అడవుల్లోనే నాటినట్లు అటవీ శాఖ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ రీజనరేషన్ పద్ధతిలో సీడ్ బాల్స్‌ను అడవుల్లో ఆకాశం నుంచి వెదజల్లడం ద్వారా 17.09 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపింది. సహజమైన పద్ధతుల్లో సుమారు 25.97 కోట్ల మొక్కలను నాటినట్లు వెల్లడించింది.
ముఖ్యమంత్రి నాటి మొక్క ఎక్కడ..?
ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూలై 4న చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో మొక్కను నాటి ‘హరితహారం’ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల చొప్పున నాలుగేండ్ల పాటు 230 కోట్ల మొక్కలు నాటేలా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రెండు సంవత్సరాలు మినహా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకోలేదు.
2017 జూలై 12న కరీంనగర్ జిల్లా మిడ్ మానేరు దగ్గర సీఎం కేసీఆర్ నాటిన మొక్క రెండు వారాల్లోనే మాయమైంది. దీన్ని తొలగించినవారిపై ఎనిమిది మంది అనుమానితులపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. 2015లో చౌటుప్పల్ హైవే దగ్గర, 2018లో గజ్వేల్‌లో కేసీఆర్ మొక్కలు నాటారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో కేసీఆర్ మరో మొక్కను నాటాలని అనుకుంటున్నారు.
ఖర్చు.. రూ. 9,777 కోట్లు:
హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మొదలు 2022 సెప్టెంబరు వరకు రూ. 9,777.24 కోట్లను ఖర్చు పెట్టినట్లు అటవీశాఖ పేర్కొన్నది. ఇందులో గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖ తరఫున ఖర్చు చేసిందే అధికం. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తున్న నిధులను సైతం పల్లె ప్రగతిలో ప్రకృతి వనాలు, నర్సరీలకు ఖర్చు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం..
విభాగం హరిత నిధులు (కోట్లలో)
గ్రామీణాభివృద్ధి శాఖ 5,006.82
అటవీశాఖ 2,567.12
హెచ్ఎండీఏ 634.01
జీహెచ్ఎంసీ 114.43
గ్రీన్ ఫండ్ 1,454.84
మొత్తం 9,777.22
‘కాంపా’ నిధుల ఖర్చు రూ. 1,739.92 కోట్లు
అడవులను ధ్వంసం చేసినందుకు ప్రత్యామ్నాయం (పరిహారం)గా మరోచోట ఫారెస్టు తరహా వాతావరణాన్ని సృష్టించాలన్నది కేంద్ర పర్యావరణ చట్టంలో పేర్కొన్న నిబంధన. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టు వ్యయం నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కాంపా’ నిధుల రిజర్వు ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన వాటాను జమ చేయాలి.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం ‘కాంపా’ నిధుల నుంచి రూ. 1,739.92 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలో సుమారు 12,651 హెక్టార్ల మేర మొక్కలను పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 నాటికి కేవలం 4,951 హెక్టార్లలోనే కాంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్ ప్రక్రియ పూర్తయింది.
చెట్లు నరకడం.. మొక్కలు నాటడం
దశాబ్దాల తరబడి ఏపుగా పెరిగిన చెట్లను నరికేయడం వాటి స్థానంలో మొక్కలు నాటడం రాష్ట్రంలో రెగ్యులర్ ప్రాక్టీసుగా మారింది. నరికిన చెట్లను మరోచోట నాటినట్లుగా ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తున్నది. దీంతో చెట్లు నరికిన ప్రాంతంలో గ్రీన్ కవర్ పూర్తిగా ధ్వంసమవుతున్నది. మరోచోట పెంచుతున్నట్లుగా చెప్తున్నది.
ఫార్ములా-ఈ కార్ రేస్ కోసం హైదరాబాద్ సిటీలో ఎన్టీఆర్ మార్గ్ లో పదుల సంఖ్యలో చెట్లను నరికేసిన హెచ్ఎండీఏ పరిహారంగా మొక్కలు నాటడంతో సరిపెట్టుకున్నది. తొలగించిన చెట్లను సంజీవయ్య పార్కులో పెట్టినట్లు చెప్తున్నది. నరికేసిన చెట్ల స్థానంలో మళ్లీ భారీ స్థాయిలో ఖర్చు చేసి కొత్తగా ప్లాంటింగ్ చేస్తున్నది. బ్యూటిఫికేషన్ పేరుతో హంగు ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రకృతిని పరిరక్షించడానికి ఇవ్వడంలేదు.
సచివాలయం కోసం ప్రకృతి విధ్వంసం
కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నింటినీ ప్రభుత్వం నరికేసింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో పదుల సంవత్సరాలుగా ఉన్న 207 భారీ వృక్షాలను నరికేసింది. వీటిని శంషాబాద్ సమీపంలోకి ట్రాన్స్ లోకేట్ చేసినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. నరికేసిన చెట్లలో 15 మీటర్ల ఎత్తు, ఒక మీటర్ చుట్టుకొలత ఉన్న వేప, బాదం, మర్రి, రావి, పగోడా, అశోకా, అల్లనేరేడు, రాయల్ పామ్ చెట్లు కూడా ఉన్నాయి.
మొత్తం ఐదు విడతలుగా ఈ చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు రోడ్లు-భవనాల శాఖ సౌత్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్కొన్నారు. ఐదో విడతో తొలగించిన 16 చెట్లను మాత్రం ట్రాన్స్ లొకేట్ చేయలేకపోయామని వివరించారు. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలో ఒక్క చెట్టు కూడా లేదు. కేవలం అందం కోసం పామ్ చెట్లను మాత్రం నాటి సరిపెట్టుకున్నది.
సీఎం తలపై ‘హరితహారం’ టోపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన సందర్భంగా తలపై ‘హరితహారం’ పేరుతో టోపీని పెట్టుకోవడం ప్రజల్లో చర్చకు దారితీసింది. టోపీ ధరించడంపై సెటైర్ల సంగతి ఎలా ఉన్నా దానిపై ‘హరితహారం’ అనే అక్షరాలు రాసి ఉండడం సరికొత్త ఆసక్తికి కారణమవుతున్నది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరిశీలన కోసం వెళ్లినప్పుడు ఈ టోపీని ధరిస్తున్నారు.
కానీ ఇండోర్ మీటింగుల్లో మాత్రం ఆ టోపీ కనిపించదు. గాలి, ఎండ లాంటి అసౌకర్యం ఉండే సమయాల్లో ఈ టోపీని ధరిస్తున్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆఫీసర్లు చెప్తున్న మాట. ఇటీవల మహారాష్ట్ర టూర్ సందర్భంగా కూడా ఈ టోపీని ధరించారు. ఒక రకంగా ‘హరితహారం’ కార్యక్రమానికి పబ్లిసిటీ కూడా అవుతున్నదని సమర్థించుకుంటున్నారు.
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పేరుతో పబ్లిసిటీ
ఇటీవలి కాలంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ తెరపైకి వచ్చింది. కేసీఆర్‌కు సన్నిహతంగా ఉండే ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ దీనికి శ్రీకారం చుట్టినట్లుగా గులాబీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో గ్రీన్ చాలెంజ్ పేరుతో అప్పటికే చాలా అమల్లో ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు పబ్లిసిటీ తెచ్చుకోడానికి, వ్యక్తిగతంగా ఎంపీ సంతోశ్ తీసుకొచ్చిన చాలెంజ్ అంటూ పాపులారిటీ పెంచుకోడానికి ఉపయోగపడుతున్నది.
సినీ సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సివిల్ సర్వెంట్లు బర్త్ డే సందర్భంగా మొక్కలను నాటడం ఒక పబ్లిసిటీ స్టంట్‌గా మారింది. ఈ పేరుతో 2021 ఫిబ్రవరి 17న ఒకే రోజున కోటి మొక్కలు (కోటి వృక్షార్చన) నాటి రికార్డు సృష్టించినట్లు క్లెయిమ్ చేసుకుంటున్నది.
Read More:
కేసీఆర్‌కు ఊహించని షాక్.. బీఆర్ఎస్‌తో ‘దోస్తీ’ తెంచుకునేందుకు సిద్ధమైన MIM..!