ఆర్థిక విప్లవాన్ని సృష్టించి…దేశ ఆర్థిక ప్రగతికి నాంది పలికిన గొప్ప వ్యక్తి…

by Kalyani |
ఆర్థిక విప్లవాన్ని సృష్టించి…దేశ ఆర్థిక ప్రగతికి నాంది పలికిన గొప్ప వ్యక్తి…
X

దిశ, ఖైరతాబాద్ : పూర్వ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు ఆర్థిక విప్లవాన్ని సృష్టించి దేశ ఆర్థిక ప్రగతికి నాంది పలికారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీవీ జ్ఞానభూమి, పీవీ మార్గ్ లో పూర్వ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు వర్ధంతి సంస్కరణ సభ సందర్భంగా పీవీ ఘాట్ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ… పీవీ నరసింహారావు ఆదర్శవంతమైన రాజకీయ జీవితంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ ప్రపంచంలో పేరు వచ్చేలా దేశానికి అన్ని విధాల తీర్చిదిద్దారన్నారు. కరీంనగర్ జిల్లా మంథని నుండి రాజకీయ ప్రస్థానం ప్రారభించిన తెలంగాణ బిడ్డ పీవీ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా,దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఒక ఆర్థిక విప్లవాన్ని సృష్టించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసారని అన్నారు.

విద్యతోనే వ్యక్తిత్వం, సమాజం బాగుపడుతుందని విద్యార్థుల బంగారు భవిష్యత్ కు గురుకులాలు అలాగే కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచారని, రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘాట్ పై పుష్పగుచ్చం నుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న తరుణంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశానికి విశేషమైన సేవలను అందించిన మన తెలుగు బిడ్డ భారత రత్న మాజీ ప్రధాని పి. వీ. నరసింహారావు ప్రపంచ పటంలో చిరస్మరణీయుడిగా నిలుస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎం పి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల చారి, హార్కర వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వాణి దేవి, శాసన సభ్యులు రావూరి ప్రకాష్ రెడ్డి, మార్కన్ సింగ్ ఠాకూర్, శ్రీనివాస్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, మాజీ ఎం. పి కె వి పి రామచంద్ర రావు, మాజీ బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ ప్రసాద్, పీవీ రాజేశ్వరరావు, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిళ్ళ హరికృష్ణ, ఆర్ డి ఓ సాయిరామ్, తహసీల్దార్ నయిముద్దీన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story