రైతులను వేధిస్తున్న నకిలీ బెడద

by Jakkula Mamatha |
రైతులను వేధిస్తున్న నకిలీ బెడద
X

దిశ,వర్ధన్నపేట:అన్నదాతలకు పంటలపై సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట , రాయపర్తి, పర్వతగిరి, హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలంలో నకిలీ మందులు, విత్తనాలు రైతులను నట్టేట ముంచేస్తున్నాయి. ప్రతి మండలంలో 10 నుంచి 15 ఫర్టిలైజర్ షాపులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో షాపులను తనిఖీ చేయాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని షాపుల్లో అధిక రేట్లకు మందులు విక్రయిస్తూ కనీసం రశీదు కూడా ఇవ్వకుండా అన్నదాతల జేబులు గుల్ల చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యవసాయం, పురుగు మందుల పై అవగాహన లేనివారు ఫర్టిలైజర్ షాపులను నిర్వహిస్తూ రైతులను నష్టాల పాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఫర్టిలైజర్ షాపు లైసెన్సులు అర్హులైన వారి పేరిట తీసుకుని అనర్హులు ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు షాపుల నిర్వహణ కొనసాగిస్తున్నా వ్యవసాయ శాఖ ఏవోలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వర్ధన్నపేట మండలంలో పత్తి విత్తనాలు మొలకెత్తలేదని, నకిలీ విత్తనాలు విక్రయించారంటూ ఓ ఫర్టిలైజర్ షాపుపై స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్టు అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.

నకిలీ మందుల అమ్మకం..

ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ మందుల అమ్మకం జరుగుతున్నా వ్యవసాయ శాఖ ఏవోలు షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్దతండాలో ఫర్టిలైజర్ షాపు యజమాని అవగాహన లోపంతో పురుగుల మందులు విక్రయించడంతో దాదాపు 20ఎకరాల్లో చేతికొచ్చిన పంట ఎరుపుఎక్కి పూత రాలిపోయింది. అన్నదాతలు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. దీంతో మండలంలో వ్యవసాయ శాఖ అధికారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రైతులకు అవగాహన కల్పించని ఏవోలు, ఏఈవోలు..

రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో రైతులకు పంటలపై అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ ఏవోలు విఫలమయ్యారని చెప్పవచ్చు. వానాకాలం యాసంగి కాలంలో కాలానికి అనుగుణంగా భూమి పరీక్షలు నిర్వహించి రైతులకు ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందో అవగాహన కల్పించాలి. కానీ ఏ ఒక్క గ్రామంలో రైతులకు ఇప్పటి వరకు పంటలపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవని, అధికారులు కేవలం రైతు వేదికలకే పరిమితం అవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి పెట్టి నష్టపోతున్న రైతులు..

రైతులు పంట కోసం రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. కొన్ని చోట్ల ఫర్టిలైజర్ షాపు యజమానులే వ్యవసాయ శాఖ అధికారులుగా వ్యవహరిస్తూ తమకు ఇష్టమైన, కమిషన్ ఎక్కువ వచ్చే కంపెనీ మందులను రైతులకు విక్రయిస్తూ వారిని నష్టాలపాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్నదాతలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ షాపుల పై నిఘా పెట్టి, రైతులకు పంటలు, మందుల వాడకం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..

ఫర్టిలైజర్​షాపుల్లో రైతులకు అధిక ధరలకు పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. మండలంలో అవసరమైన వ్యక్తులకు భూసార పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. అర్హత కలిగిన వ్యక్తులు మాత్రమే ఫర్టిలైజర్ షాపులను నిర్వహిస్తున్నారు.

షాపుల్లో తనిఖీలు చేపడుతున్నాం..

నేను విధుల్లో చేరి 15 రోజులు అవుతుంది. అనుమానం కలిగిన ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాను. రైతులకు పురుగు మందులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామంలో ఏఈవోలు రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..

పర్వతగిరి మండలం లో ఎలాంటి నకిలీ మందుల అమ్మకం జరగడం లేదు. లైసెన్స్ కలిగిన షాపుల వద్దనే పురుగు మందులు కొనుగోలు చేయాలి. రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎవరో కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశలకు రైతులు హాజరు కావడం లేదు.

Advertisement

Next Story