సిటీలో 29 మోడల్ కారిడార్లు

by Sathputhe Rajesh |
సిటీలో 29 మోడల్ కారిడార్లు
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుకూలంగా మెయిన్ రోడ్లను అభివృద్ధి చేసే దిశగా బల్దియా చర్యలు చేపట్టింది. రూ.56.82 కోట్లతో మరో 29 మెయిన్ రోడ్లను మోడల్ కారిడార్లుగా తీర్చిదిద్దేందుకు సిద్దమైంది. రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఒక్కో రోడ్డుకు వెచ్చించి ఐదు రకాల అభివృద్ది పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.

ముఖ్యంగా ఒక రోడ్డును అక్కడి స్థానిక వాహనాల రద్దీకి అనుకూలంగా విస్తరించటం ఓసారి, మిగిలిన అభివృద్ది పనులు మరోసారి చేపట్టిన బల్దియా ఇప్పుడు పార్కింగ్, గ్రీనర్, వెండింగ్ జోన్ల ఏర్పాటుతో పాటు ఎంపిక చేసిన 29 మెయిన్ రోడ్లను మోడల్ కారిడార్లుగా తీర్చిద్దనుంది. మహానగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావటం, మరికొన్ని ఇప్పటికే తమ సంస్థలను నెలకొల్పే పనులను చేపట్టినందున మెయిన్ రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేయాలన్న ఉద్దేశ్యంతోనే బల్దియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించల్సిన బాధ్యత కూడా జీహెచ్ఎంసీపైనే ఉన్నందున గతంలో కన్నా భిన్నంగా మెయిన్ రోడ్లను అభివృద్ది చేసేందుకు శ్రీకారం చుట్టారు.

21 వేల 535 మీటర్ల పొడవున అభివృద్ధి

ఇందులో భాగంగానే 150 నుంచి 200 అడుగుల వెడల్పుతో ఉన్న ప్రాంతాల్లోని రోడ్లను మోడల్ కారిడార్లుగా అభివృద్ది చేయనున్నారు. రూ.56.82 కోట్ల అంచనా వ్యయంతో మోడల్ కారిడార్లను 21 వేల535 మీటర్లు పొడవున అభివృద్ది చేయనున్నారు. ఈ మోడల్ కారిడార్లలో స్థలాన్ని, స్థానిక అవసరాలను బట్టి వెడ్డింగ్ జోన్, సర్వీస్ రోడ్డు, పార్కింగ్, పాదచారుల సౌకర్యం కోసం, గ్రీనరీ పనులు చేపట్టనున్నారు.

ఇప్పటికే కొన్ని కారిడార్ల పనులను కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హబ్సిగూడ నుంచి నాగోల్ ఎల్‌బీ నగర్ మీదుగా ఓవైసీ చౌరస్తా వరకు అక్కడి నుంచి అరాంఘర్ వరకు, ఎన్‌ఎండీసీ నుంచి షేక్‌పేట్ మీదుగా గచ్చిబౌలి వరకు ఇరువైపులా మోడల్ కారిడార్లు నిర్మాణాలను చేపట్టనున్నారు.

Advertisement

Next Story