సచివాలయం… శిథిలం

by Anukaran |   ( Updated:2020-07-27 10:06:22.0  )
సచివాలయం… శిథిలం
X

దిశ, న్యూస్‌బ్యూరో: సుమారు ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవలందించిన సచివాలయం మూడు వారాల్లోనే నేలమెట్టమైంది. వందేళ్ళ భవనం మొదలు పదేళ్ళు కూడా నిండని కొత్త భవనాలు కూడా కుప్పగూలాయి. నిన్నమొన్నటిదాకా నిలువెత్తు భవనాలతో కళకళలాడిన సచివాలయ ప్రాంగణం సోమవారం నాటికి శిథిలాల కుప్పగా మారిపోయింది. ఏ భవనం ఎక్కడుండేదో కూడా తెలియనంతగా మారిపోయింది. ఇరవైనాలుగ్గంటలూ పొక్లెయిన్‌లు భవనాలను కూలుస్తూనే ఉన్నాయి. కుప్పగా పేరుకుపోయిన వ్యర్ధాలను టిప్పర్లు తరలిస్తూనే ఉన్నాయి. ఇంకో రెండు భవనాలను కూల్చేపని ముమ్మరంగా సాగుతోంది.

ఇంతకాలం ఒక రహస్య వ్యవహారంగా సాగిన కూల్చివేత పనులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీడియాను తీసుకెళ్ళి దగ్గరుండి చూపించింది ప్రభుత్వం. మీడియాను అక్కడికి తీసుకెళ్ళి కవరేజ్‌కు అవకాశం కల్పించామని హైకోర్టుకు తెలియజేయడం కోసం మొక్కుబడి చర్యలు తీసుకుంది. జూపార్కు సఫారీలో వాహనం లోపల సందర్శకులను తీసుకెళ్ళిన తరహాలో మీడియా సిబ్బందిని వాహనాల్లో తీసుకెళ్ళి కిందకి కూడా దిగనీయకుండా అడుగడుగునా పోలీసు ఆంక్షలను విధించింది. కరోనా నిబంధనలు, మీడియా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం అక్కడకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం అదే కరోనా నిబంధనలను తుంగలో తొక్కి ఒక్క వాహనంలో పాతికమందికిపైగా వీడియో కెమెరామెన్ సిబ్బందిని కుక్కేసింది. ఇప్పటికీ సచివాలయం కూల్చివేతలో ఏం జరుగుతోందనేది రహస్యంగానే ఉండిపోయింది.

ఆనవాళ్ళు కూడా మిగలని సచివాలయం

సచివాలయంలో ఎక్కడ ఏ భవనం ఉందో, అందులో ఏయే ప్రభుత్వ విభాగాలు ఉంటాయో పాత్రికేయులకు, ఉద్యోగులకు చిరపరిచితం. కానీ కూల్చివేత పనులు ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై ఇప్పుడు ఎనిమిది భవనాలు నేలకూలి ఇంకా రెండు భవనాలు ఆ దశలో ఉండడంతో ఎక్కడ ఏ బ్లాక్ ఉందో తెలియనంతగా శిథిలాల కుప్పగా మారిపోయింది. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో కూడిన సిమెంటు వ్యర్థాలు, కాంక్రీటులోని ఇనుమును వేరుచేయడానికి గ్యాస్ కట్టర్లు, రాళ్ళను లోడింగ్ చేయడానికి డంపర్లు.. ఇలా ఏక కాలంలో అనేక పనులు జరిగే ఒక ప్రాంతంగా మారిపోయింది. ఎటుచూసినా ఇనుప తీగల గుట్టలు, సిమెంటు వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.

సుమారు నాలుగైదు వేల టిప్పర్ల లోడుకు సరిపోయేంతగా వ్యర్ధాలు తయారవుతాయని రోడ్లు భవనాల శాఖ అధికారులు అంచనా వేసి ఈ వారం రోజుల వ్యవధిలోనే సుమారు రెండు వేల లోడును తరలించినట్లు సచివాలయంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. నిజాం గుప్తనిధి దాగి ఉన్నట్లుగా ‘జి’ బ్లాక్ గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో కనీసం అక్కడ గతంలో ఒక భవనం ఉండేదన్న ఆనవాళ్ళు కూడా మిగలకుండా మొత్తం చదును ప్రాంతంగా మార్చేశారు. నల్లపోచమ్మ ఆలయం నేలమట్టమైంది. ‘సి’ బ్లాక్ పక్కన ఉన్న మసీదు ఉందో లేదో కూడా తెలియనంతగా భవనాల వ్యర్ధాలతో నిండిపోయింది.

అడుగడుగునా రహస్యం… పోలీసు పహరా

హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినందున మీడియాను కవరేజ్ కోసం అనుమతించిన ప్రభుత్వం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేసి జీహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షంలో సచివాలయం ప్రాంతానికి తీసుకెళ్ళింది. వాహనంలో ఎక్కింది మొదలు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ఎక్కడా మీడియా సిబ్బందిని కిందికి దిగనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతను ప్రధాన కారణంగా చూపి ఇంతకాలం మీడియాకు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రమాదానికి ఆస్కారం లేకపోయినా సిబ్బందికి పూర్తి వివరాలు తెలియకూడదన్నంత రహస్యంగా వారి కదలికలను పోలీసులు పరిమితం చేశారు. పోలీసు పహరా నడుమనే తూతూ మంత్రంగా మీడియా సందర్శనను ముగించింది.

మీడియాకు మొక్కుబడి సందర్శన ఏర్పాట్లు

జూపార్కు సఫారీలోకి వాహనంలో వెళ్తూ పులులు, సింహాలను చూసినట్లుగా వాహనం లోపలే ఉండి కూలిపోయిన శిథిలాల గుట్టలను చూసే తీరులో మీడియా సందర్శనకు ప్రభుత్వం మొక్కుబడి ప్రహనంగా ఈ కార్యక్రమాన్ని ముగించింది. పనిచేసే సిబ్బందితో మాట్లాడనీయలేదు. వివరాలను తెలుసుకోడానికి ఆస్కారం లేకుండా ఆంక్షలు అమలయ్యాయి. వీడియో కెమెరామెన్ సిబ్బందిని రెండు వ్యాన్లలో కుక్కి మరీ ఎక్కించి ఒక్క అంగుళం కూడా వారి మధ్య దూరం లేకుండా కొవిడ్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. మీడియా ప్రతినిధులు మొత్తుకుని మరీ వాహనాలను సమకూర్చాల్సిందిగా కోరినా వారి మొర గోడకు చెప్పిన చందంగానే మిగిలిపోయింది.

హైకోర్టును మభ్యపుచ్చడానికేనా?

కరోనా పరిస్థితుల నేపథ్యంలో మీడియాను అనుమతించలేమని హైకోర్టుకు తెలియజేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీడియాను అక్కడకు తీసుకెళ్ళి కవరేజ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పడం కోసమే తప్ప నిజంగా అక్కడి వాస్తవిక దృశ్యాలను, వివరాలను తెలుసుకోడానికి ఆస్కారమే లేకుండా పోలీసులు వ్యవహరించారు. కూల్చివేత సమయంలో దుమ్ము, ధూళితో కాలుష్యం చోటుచేసుకుంటుందని చెప్పినట్లుగానే ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళికణాలతో నిండిపోయింది.

మరో రెండు వారాలపాటు పనులు

ప్రస్తుతం కూల్చివేత దశలో ఉన్న ఎల్, జే బ్లాకులు పూర్తిగా నేలమట్టం కావడానికి ఇంకో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అక్కడ పేరుకుపోయిన వ్యర్ధాలన్నింటినీ తొలగించడానికి కనీసంగా ఆ తర్వాత మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని చదునుచేసి కొత్త భవనం నిర్మాణానికి వీలుగా సిద్ధం చేయడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ యంత్రాల మోత, వాహనాల రొద, దుమ్ము-ధూళి తప్పదు.

మరో చోటికి చెట్ల తరలింపు

సచివాలయం ప్రాంగణంలో కనీసంగా 250 ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. కొన్నింటిని కూల్చినా ఇంకా చాలా చెట్లు అలాగే ఉండిపోయాయి. ఇక ప్రహరీగోడకు ఆనుకుని రెండు వైపులా ఉన్న చెట్లు కూడా అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ తొలగిస్తే తప్ప కొత్త సచివాలయం నిర్మాణం సాధ్యం కాదు. ఒకవైపు హరితహారం పేరుతో పచ్చదనం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు చెట్లను నరికితే చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి వేర్లతో సహా తొలగించి మరో చోట నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు.

Advertisement

Next Story