- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌పైనే ఆశలన్నీ
• టికెట్లకు డబ్బుల్లేక గల్ఫ్‌లోనే
• తెలంగాణ యువకుల నిస్సహాయ స్థితి
దిశ, న్యూస్ బ్యూరో: పొట్ట చేత పట్టుకుని దుబాయ్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు.. ఇప్పుడు కేసీఆర్ కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్’ క్యాంపెయిన్‌లో భాగంగా పన్నెండు దేశాల్లోని భారతీయులను సొంతూళ్లకు తీసుకొస్తోంది. కానీ వేలాది మంది తెలంగాణ బిడ్డలకు మాత్రం ఆ భాగ్యం దక్కడంలేదు. కారణం టికెట్లు కొనుక్కోడానికి వారి చేతుల్లో డబ్బులు లేకపోవడమే. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఆమ్నెస్టీ’లో భాగంగా సుమారు 14 వేల మంది భారతీయులు పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో చాలా మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని, టికెట్ కొనుక్కోడానికి డబ్బుల్లేక నాలుగు గోడలకే పరిమితమవుతున్నామని నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమ్నెస్టీ’ జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న తెలంగాణ యువకులు ఒకటిన్నర నెల రోజులుగా వివిధ షెల్టర్లలో ఒక్కో గదిలో 16 మంది చొప్పున ఉంటున్నారు. రంజాన్ మాసం కావడంతో రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం దొరుకుతోందని, చాలా మందిని విమానాల్లో తీసుకెళ్తున్నా తమ పేరు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నామని వాపోయాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు విమాన టికెట్‌ను వారే కొనుక్కోవాలని, ఇక్కడకు వచ్చిన తర్వాత విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సినందున అందుకయ్యే ఖర్చు కూడా వారే భరించాలని స్పష్టం చేసింది. కానీ వారు అటు విమాన టికెట్‌కు అయ్యే రూ. 15 వేలుగానీ, ఇక్కడకు వచ్చిన తర్వాత 14 రోజుల క్వారంటైన్‌కు అయ్యే రూ. 5 వేలను గానీ భరించే స్థితిలో లేరు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్ విభాగం అధికారి ఒకరు వివరిస్తూ.. టికెట్ కొనుక్కుని, ఇక్కడ క్వారంటైన్ ఖర్చులు భరించగలిగినవారిని మాత్రమే రప్పిస్తున్నామని, మిగిలినవారు అక్కడే ఉండిపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత సౌకర్యాలకు అనుగుణంగా మామూలు హోటళ్లలో రూ. 5 వేలు, 2 స్టార్ హోటల్‌లో రూ. 15 వేలు, త్రీ స్టార్ హోటల్‌లో రూ. 30 వేల చొప్పున వారే భరించాలని స్పష్టం చేశారు.
కువైట్‌లోని ఒక షెల్టర్‌లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవన్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నాలుగు గోడలకు పరిమితం చేసిందని, కరోనా కారణంగా ఇరుకైన గదుల్లోనే ఉండాల్సి వస్తున్నందున తమకు వైరస్ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశాడు. ఒకటిన్నర నెల రోజులుగా ఇదే పరిస్థితిలో మగ్గుతున్నామని, ప్రధాని ‘వందే భారత్’ ప్రకటించినా తాము ఆ భాగ్యానికి నోచుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు ఒక్క పూట మాత్రమే తింటూ రోజురోజుకూ నీరసపడిపోతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతలచి తమని స్వరాష్ట్రానికి తీసుకెళ్తారన్న ఒకే ఒక నమ్మకంతో వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నామని’ అన్నారు. డబ్బులే పెట్టుకునే స్థోమత ఉంటే దేశంకాని దేశానికి ఎందుకొస్తామని అదే జిల్లాకు చెందిన మరో యువకుడు మొరపెట్టుకున్నాడు. ఇప్పటికే నెలన్నర అయిపోయింది, వారు ఇచ్చే ఆహారం మీదనే ఆధారపడ్డాం తప్ప చేయడానికి పని లేక, చేసుకునే అవకాశం లేక షెల్టర్లలో బందీలమైపోయాయమని వాపోయాడు.
తెలంగాణ గల్ఫ్ మైగ్రాంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాట్కూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ.. పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం వేలాది మంది యువకులు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి అప్పులు చేసి మరీ వెళ్ళారని, అక్కడకు వెళ్ళిన తర్వాత వారి కలలు కల్లలయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుగు ప్రయాణానికి డబ్బుల్లేక, అక్కడ చేయడానికి పనిలేక వారి జీవితాల్లో గాల్లో దీపాల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కువైట్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ, అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో ఉపాధి కోసం వెళ్ళారని, ఇప్పుడు ‘వందే భారత్’లో భాగంగా పేర్లను నమోదు చేసుకున్నవారిని ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామని కువైట్ హామీ ఇచ్చినా.. చివరకు అక్కడి స్థానిక అధికారులు ‘స్వంత ఖర్చులతోనే’ అని షరతు విధించడంతో వీరికి అవకాశం లేకుండాపోయిందన్నారు. కొన్ని నెలలుగా వీరికి వేతనాలు అందలేదని, అవి ఉంటే టికెట్ కొనుక్కుని వచ్చేవారన్నారు.
వలస కార్మికులకు పైసా ఖర్చులేకుండా సొంతూళ్ళకు వెళ్ళేలా రైలు టికెట్ ఖర్చుల్ని భరిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ విధంగానే వలస కార్మికులు తెలంగాణ నుంచి ‘శ్రామిక్ ఎక్స్‌ప్రెస్’ రైళ్ళలో సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయి స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న యువకుల ఆశలు కూడా కేసీఆర్‌పైనే ఉన్నాయి. గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై పాలసీ తీసుకొస్తామని ప్రకటించిన మంత్రి కేటీఆర్.. కేరళలో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి అధికారుల బృందాన్ని కూడా పంపారు. ఇప్పుడు కువైట్‌లోని షెల్టర్లలో గంటల్ని రోజులుగా లెక్కపెట్టుకుంటున్న తెలంగాణ యువకులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది.