ఆర్టీసీని కాపాడుకుందాం.. చార్జీలు పెంచుతున్నాం..!

by Shyam |
ఆర్టీసీని కాపాడుకుందాం.. చార్జీలు పెంచుతున్నాం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బస్సు చార్జీలు మరోసారి పెరగనున్నాయి. నష్టాలలో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు. 2019లో చార్జీలు పెంచి టికెట్​ ధరలను సమం చేశారు. టికెట్​ కనీస ధరను రూ. 10గా నిర్ణయించారు. అయినా ఆర్టీసీకి లాస్ తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా మరింత నష్టం వాటిల్లింది. ఈ అన్ని వివరాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

డీజిల్​ భారం పెరుగుతోంది

లాక్​డౌన్​ కష్టాలతో పాటు, పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఆర్టీసీకి కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం రోజువారీగా రూ. 12 కోట్ల ఆదాయం వస్తున్నా అది సరిపోవడం లేదు. గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి వరకు లీటర్ డీజిల్ కు రూ. 16 చొప్పున పెరిగింది. ఒక్క రూపాయి పెరిగితే ఏడాదికి రూ. 22 కోట్ల నష్టం ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు డీజిల్​పై రూ. 400 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పుడు ఆరు లక్షల లీటర్ల డీజిల్ ను​ వినియోగిస్తున్నారు. ఈనెల మ‌రీ దారుణంగా మారింది. లీటర్​ డీజిల్​పై రూ. ఆరు చొప్పున పెరిగింది. దీంతో ఒక్కనెలలోనే రూ.11 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 దాటినా జీతాలు ఇవ్వలేదు. కార్మికులు ఆందోళనకు దిగడంతో డిపోలవారీగా వేతనాలు ఇచ్చారు. రూ. 11 నుంచి రూ. 12 కోట్లు ఆదాయం వస్తున్న స‌మ‌యంలో జీతాల‌కు ఇబ్బంది ప‌డ‌టం దారుణ‌మ‌ని అంటున్నారు. టికెట్ల అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.3,976 కోట్లు వస్తాయి. ఏటా మారుతుంది. షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తాయి. అన్నీ కలిపి సుమారు ఆదాయం రూ.4,880 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఖర్చు ఆదాయం కంటే వెయ్యి కోట్ల వరకు అదనంగా ఉంటుంది. ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసంతో ఆర్టీసీ నష్టాల బారిన పడుతోంది. కరోనా తరువాత బస్సులు మళ్లీ రోడ్డెక్కినా ప్రయాణికులు ఆదరించకపోవడంతో నష్టాలలో కూరుకుపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలలోనే ఆర్టీసీ చరిత్రలోనే కనివీనీ ఎరుగని రీతిలో రూ.1800కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.

రెండుసార్లు టికెట్​ ధరలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ఆర్టీసీ టికెట్​ ధరలను పెంచింది. 2016లో ఒకసారి 8.77శాతం, 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం రెండోసారి కొన్ని బస్సుల మీద 10 శాతం పెంచారు. అప్పట్లో సాలీనా రూ. 286 కోట్ల మేర భారం పడింది. ఆ తర్వాత ప్రభుత్వం చార్జీల పెంపు జోలికి పోలేదు. ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలిచ్చినా ప్రభుత్వం అంగీ కరించలేదు. 2019లో ప్రభుత్వం కిలోమీటర్‌ కు 20 పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచింది. చిల్లర సమస్యను నివారించడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 5, 10, 15, 20 రూపాయల వంటి రౌండ్‌ ఫిగర్స్‌ను అమలు చేసింది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచటంతో.. సాలీనా రూ.752 కోట్ల మేర ప్రజలపై భారం పడింది. అంటే 18.80% మేర ఛార్జీలు పెంచింది. ఈసారి మాత్రం ముందుగా గ్రేటర్​ పరిధిలోనే పెంచాలని భావించినా… నష్టం పేరుకుపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా

పెంపునకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇపుడు కిలోమీటరుపై 15 పైసల చొప్పున పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని బస్సులలో 10 పైసలు, మరికొన్ని బస్సులకు 15 పైసల చొప్పున పెంచేందుకు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. బడ్జెట్​ సమావేశాల అనంతరం చార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది.

ఇలా పెంచుకుంటే పోతే ఎలా

అంతర్జాతీయంగా క్రూడాయిల్​ ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం ఇంధన ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వాల పన్నుల భారంతోనే డీజిల్​ ధరలు పెరుగుతున్నాయి. ఆ సాకుతో చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుంది. ఇంధన ధరలు పెరిగితే ఆర్టీసీ చార్జీలు పెంచడం సరికాదు. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. కిలోమీటరుకు 15 పైసల చొప్పున పెంచితే నష్టం ఉండదని, ఆ తర్వాత డీజిల్​ ధరలు పెరిగితే మళ్లీ చార్జీలు పెంచుతారా? ‌‌రాజిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి.

Advertisement

Next Story

Most Viewed